Suraram Colony | జీడిమెట్ల, మార్చి 23 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీతో పాటు 14 బస్తీలలో తాగునీటి కొరత నెలకొంది. గతంలో వారానికి రెండు మూడు రోజులలో నీటి సరఫరా అయ్యేది. గత పదిహేను రోజులుగా వారానికి ఒకసారి జలమండలి అధికారులు గోదావరి జలాలు సరఫరా చేస్తుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారానికి కోసారి సరఫరా అయ్యే 40 నిమిషాల వ్యవధిలో అది కూడా లో ఫ్రేషర్ తో వస్తుండడంతో తాగునీటి కోసం ప్రజలు వాటర్ ప్లాంట్లను ఆశ్రయించి 20 లీటర్ల టినులను కొనుగోలు చేస్తున్నారు.సూరారం కాలనీ , బ్రహ్మాణ బస్తీ, ఆనంద్ నగర్, సుందర్ నగర్, దయానంద నగర్, రాజ్యలక్ష్మీనగర్, మైత్రినగర్, వీడిఆర్ స్ట్రీట్, మరాఠి బస్తీ, ఏకలవ్యనగర్, ప్రియాంక నగర్, సుభాష్ చంద్ర బోస్ నగర్, రాజుల స్వామి నగర్, సూర్యనగర్, తదితర బస్తీలలో తాగునీటి కొరత ఏర్పండింది.
అపార్టుమెంట్ వాసులు రూ.500 చెల్లించి జలమండలి ట్యాంకర్లను కొనుగోలు చేస్తుండగా, నిరుపేదలు వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇతర అవసరాలకు బోరు నీటిని వినియోగిస్తున్నారు. వారానికి ఒకసారి సరఫరా అయ్యే గోదావరి జలాలు సమయ పాలన లేకుండా ఇష్టానుసారంగా వస్తుండడంతో ఎప్పుడు నీళ్ళు వస్తాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై జలమండలి వాటర్ మెన్లను స్థానిక ప్రజలు ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుతున్నారని సుభాష్ చంద్రబోస్ నగర్‌కు చెందిన మనిషా అనే మహిళా ఆవేదన వ్యక్తం చేసింది. వేసవి కాలం ప్రారంభంలోనే నీటి సమస్య ఇలా ఉంటే రాబోయే మూడు నెలలు ఎలా ఉంటుందోనని ఆయా బస్తీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు స్పందించి తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.
వారానికోసారి నీళ్ళు వస్తున్నాయి
గత 15 రోజుల నుంచి వారానికోసారి నీళ్ళు వస్తున్నాయి. లో ఫ్రేషర్తో 40 నిమిషాలు మాత్రమే నీళ్ళు వస్తుండడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇతర అవసరాలకు బోరు నీటిని వాడుకుంటున్నాం. వాటర్ వర్క్స్ అధికారులు స్పందించి వారానికి రెండు రోజులైన తాగునీటిని సరఫరా చేయాలని కోరుతున్నాం.
ఎం.సరస్వతి , సుభాష్ చంద్రబోస్ నగర్
సమయ పాలన పాటించడం లేదు
వారానికోసారి వచ్చే నీళ్ళు ఇష్టానుసారంగా వదులుతున్నారు. ఎప్పుడు వస్తాయో నీళ్ళని ఎదురు చూడాల్సి వస్తుంది. ఇదే విషయమై వాటర్ మెన్ ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. తాగడానికి నీరు సరిపోక వాటర్ ప్లాంట్ల వద్దకు వెళ్ళి డబ్బులు వెచ్చించి వాటర్ క్యాన్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎస్.రేణుక, ప్రియాంకనగర్