MLA Krishna Rao | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 19 : ప్రజలకు సరిపడా తాగునీటిని సరఫరా చేసిన తర్వాతనే నల్లాలకు బిగించిన మోటార్లను తొలగించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో స్థానికులు తాగునీటి సరఫరా ఇబ్బందులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణారావు ఇవాళ జలమండలి అధికారులతో కలిసి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నీటి సరఫరా తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగునీటికి ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు మళ్లీ సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్ల కాలంలో ఏనాడూ నీటి కొరత రాలేదని.. ప్రజలకు ప్రతీరోజు నీటిని అందించామని తెలిపారు. నేడు అధికారులు ఎందుకు నీటిని సరఫరా చేయలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. కలుషిత నీటి సమస్యలు పెరిగాయని, లో ప్రెషర్‌తో నీటి సరఫరా వల్ల వినియోగదారులు మోటార్లు బిగించాల్సి వస్తుందని, నేడు మోటార్లను తొలగిస్తూ అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.
పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు..
వాణిజ్య అవసరాల కోసం మోటార్లను పెడితే తొలగించాలన్నారు.. కానీ తాగునీటి కోసం మోటార్లు పెట్టిన పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను కోరారు. గత 10 ఏళ్ల కాలంలో మెరుగైన తాగునీటి సరఫరా కోసం వాటర్ ట్యాంకర్‌ను నిర్మించి, పైప్‌లైన్ వ్యవస్థను పునరుద్ధరించడం జరిగింది అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల చెరువులు ఎండిపోయాయని తద్వారా నీటి సమస్యలు పెరిగాయి అన్నారు.
గతంలో నీటిని పొదుపుగా వాడుకుంటూ అందరికీ సమృద్ధిగా నీటిని సరఫరా చేశామన్నారు. ప్రభుత్వం ఏనాడు సమీక్ష నిర్వహించడం లేదని, పరిపాలన లోపం వల్లే నగరంలో నీటి సమస్యలు ఉత్పన్నవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని… తాగునీటి కోసం జలమండలి కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
గతంలో నీటి కోసం బిందెలతో యుద్ధాలు జరిగేవని.. నేడు అదే పరిస్థితి రావడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజలందరికీ తాగునీటిని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా, స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, పలువురు నాయకులు, జలమండలి జీఎం ప్రభాకర్ రావు, మేనేజర్లు పాల్గొన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్