హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఒక్కో పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి ఉండడంతో ఈ గ్యాప్ విద్యార్థులకు నష్టం కలిగిస్తుందన్న భావనకు వచ్చింది. ఆలస్యంగా మేల్కొని ఎట్టకేలకు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. గ్యాప్లో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని నిర్ణయించింది.
సీబీఎస్ఈ తరహాలో పదో తరగతి పరీక్షల్లోనూ వ్యవధి ఇవ్వాలన్న ఆలోచనతో విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఓ ఉన్నతాధికారికి హఠాత్తుగా వచ్చిన ఆలోచనను అమలుచేసింది. దీనిని టీచర్ ఎమ్మెల్సీలు సహా ఉపాధ్యాయ సంఘాలన్నీ వ్యతిరేకించాయి. ఈ వ్యవధిలో విద్యార్థులు ప్రిపరేషన్ మానేసి ఆటలు, ఫోన్లు, టీవీలకు అలవాటు పడితే అసలుకే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు వివరించాయి. షెడ్యూల్ మార్చకుండ ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో భాగంగా యాక్షన్ ప్లాన్ ప్రకటించింది.