వెల్దండ/ కొల్లాపూర్ రూరల్, ఫిబ్రవరి 18: ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ, హాస్టళ్లు గాడి తప్పుతున్నాయి. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు.. ఇచ్చే భోజనం కూడా నాణ్యతగా ఉండటంలేదు.. రుచిలేని, పురుగుల భోజనం తినలేక కడుపులు మాడ్చుకుంటున్నాం’ అని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తూ బుధవారం రోడ్డెక్కారు. మంత్రి జూపల్లి ఇలాకా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని పీజీ కళాశాల హాస్టల్ విద్యార్థులు హైవే-167కేపై వండిన భోజనం గిన్నెలతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ కళాశాల ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ హాస్టల్లో మెనూ పాటించడంలేదని, రుచిలేని భోజనం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
భోజ నం సరిగాలేక జనవరి 26న జెండా పండుగకు హాజరైన కొందరు విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని గుర్తుచేశారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నెలరోజుల క్రితమే ప్రిన్సిపాల్ మార్క్ ఫెలోనియస్ దృష్టికి తీసుకెళ్లగా. పట్టించుకోకుండా.. ఏం చేస్తారో.. చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు, అధికారులు వచ్చి విద్యార్థులను అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. చివరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ‘పురుగుల అన్నం పెడుతుండ్రు.. అడిగితే బూతులు తిడుతుండ్రు.. ఈ అన్నం మాకొద్దు’.. అంటూ నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల విద్యార్థులు హైదరాబాద్-శ్రీశైలం హైవేపై బైఠాయించారు.
భోజనం నాణ్యతగా.. రుచిగా లేదని.. అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపాల్‌ను అడిగితే పురుగులు తీసేసి తినాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారని, ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సైతం డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సర్పంచ్ యాదమ్మ, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎస్సై కురుమూర్తి, పోలీసులు చేరుకొని సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించారు.