మెదక్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలు మితిమీరాయి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అండతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారంలో ఉన్నామనే ధైర్యంతో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. బుధవారం బీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడంతో భయాందోళన వాతావరణం నెలకొన్నది.
ఇటీవల మెదక్ పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒత్తిడితో మెదక్ పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు హత్యాయత్నం కేసులు నమోదు చేసి మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం వీరిని మెదక్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని సంగారెడ్డి జైలుకు తరలించారు.
బీఆర్ఎస్ కార్యకర్త ఆటో దహనం
మెదక్ పట్టణంలోని 15వ వార్డుకు చెందిన ఆటోడ్రైవర్, బీఆర్ఎస్ కార్యకర్త హబీబ్‌కు చెందిన ఆటోను మంగళవారం రాత్రి దుండగులు దహనం చేశారు. కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రాణభయం ఉన్నదని, ఆటో దహనం చేశారని హబీబ్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెదక్‌లో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోవడంతోపాటు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది..
ఈ నెల 9న మెదక్ పట్టణంలోని 15వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఆ రోజు తనను కులం పేరుతో దూషించారని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్త గోదాల అఖిల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 15వ వార్డులో గొడవ జరిగిన స్థలం వద్దకు రాత్రి తన అనుచరులు, గూండాలతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేరుకున్నారు. ఆ సమయంలో ఇరుపార్టీల శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మెదక్ ఎమ్మెల్యే వాహనంపై మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తోపాటు బీఆర్ఎస్ నాయకులు జీవన్‌రావు, వేణు, హబీబ్, మల్లేశ్, మరో 23 మంది కలిసి రాళ్లతో దాడిచేసినట్టు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ పాలకవర్గం ఎన్నిక ముగియడంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కక్ష పెట్టుకుని తమపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మెదక్‌లో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, ప్రజాస్వామ్యం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిలదీస్తే కేసులతో బెదిరిస్తారా?: కొప్పుల
ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసులతో బెదిరించడం ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బాల్కసుమన్ అరెస్టు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ దౌర్జన్యాలను అడ్డుకున్నందుకు బాల్క సుమన్‌ను అరెస్టు చేసి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోయినప్పటికీ బెదిరింపులు, దాడులకు పాల్పడుతూ అరెస్టు చేసి, మున్సిపాలిటీని కైవసం చేసుకొనే కుట్రలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని విస్మరించి, పోలీసు యంత్రాంగాన్ని ఆధారం చేసుకొని, అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
బాల సుమన్ అరెస్టు అక్రమం : వేముల
‘బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు అక్రమం.. ఆయనపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకొని, బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేసి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాల సుమన్ అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ, అధికార బలంతో ఆ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని అక్రమంగా దకించుకోవాలని చూడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి, వారిపై ఒత్తిళ్లు తెస్తూ రాజ్యాంగస్ఫూర్తిని కాంగ్రెస్ నేతలు తుంగలో తొకుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని, అక్రమాలను అడ్డుకోవాలని ప్రశ్నించిన బాల సుమన్‌పై మంత్రి వివేక్ ప్రోత్సాహంతో తప్పుడు కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ప్రతిపక్షాల గొంతు నొకాలని చూడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కొనసాగిస్తున్న పోలీసు రాజ్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం పోరాడుతాయని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి: సబితా ఇంద్రారెడ్డి
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అభివర్ణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, చైర్పర్సన్ పదవిని దూరం చేయాలని కుట్రలకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై గళమెత్తే నాయకులను అణచివేయడానికి పోలీసులను ఉపయోగించడం సరైంది కాదని హితవు పలికారు. ఘటనలో బాధితులైన బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు పెట్టడం అన్యాయమని, మహిళా కౌన్సిలర్లపై జరిగిన దౌర్జన్యంపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మెజారిటీ బీఆర్ఎస్దే అయినప్పటికీ అడ్డంకులు సృష్టించడం రాజకీయ అసహనానికి సూచిక అని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారం శాశ్వతం కాదని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. బాల్కసుమన్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్: వద్దిరాజు
సీఎం రేవంత్‌రెడ్డి తప్పిదాలను ఎండగడుతున్నందునే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బాల సుమన్‌పై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు పాలకుల మెప్పు పొందేందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం శోచనీయమని తెలిపారు. బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులు, అరెస్టులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడబోరని తేల్చిచెప్పారు. బాల్క సుమన్‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డీజీపీని కోరుతున్నట్టు తెలిపారు.
క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యం ఖూనీ: సింగిరెడ్డి
క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్పర్సన్ స్థానం కోసం కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తుందని, ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాల్క సుమన్ అరెస్టు అక్రమమని, ఆయన అరెస్టును ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ దుర్మార్గాలు, తప్పులకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు.
బాల్క సుమన్‌ను ఎదుర్కోలేకే అక్రమ అరెస్టు: దాసోజు
ప్రజాసమస్యలు, దళిత హక్కులపై నిరంతరం పోరాడే బాల్క సుమన్‌ను ఎదుర్కోలేకే రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ మేరకు బాల్క సుమన్ అరెస్ట్‌పై ఆయన బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నదని మండిపడ్డారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నదని మండిపడ్డారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా.. పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పాదర్శకంగా జరుగలేదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్యాతనపల్లి, జనగామ, తొర్రూరు, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్‌లో కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. బాల్క సుమన్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాళోజీ మాటలు నిజం చేద్దాం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే పాతరబెట్టాలి’ అన్న కాళోజీ మాటలు నిజం కావాల్సిన సమయమిది.. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన సందర్భమిది.. అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తేల్చిచెప్పారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రి వివేక్‌ను బహిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు వివేక్ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్న విశాఖ రేకులు అవసరం లేదని, వీ6 వార్తలు కూడా అక్కరలేదని, వివేక్ లాంటి స్వార్థపు దోపిడీదారులు తెలంగాణ సమాజానికి ఎంతమాత్రం అవసరమే లేదని స్పష్టంచేశారు.
పాలన చేతకాక అక్రమ అరెస్టులు: గ్యాదరి బాలమల్లు
రాష్ట్రంలో పాలన చేతకాక రేవంత్‌రెడ్డి సర్కార్ అక్రమ అరెస్టులకు తెగబడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేసి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నదని తెలిపారు. బాల్క సుమన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి వివేక్ అక్రమ అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం గమిస్తున్నదని, సందర్భం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు: దేవీప్రసాద్
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పును అవహేళన చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ హెచ్చరించారు. ప్రజా తీర్పును అమలు చేయాలని పోరాడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం అమానుషమని మండిపడ్డారు. బాల్క సుమన్‌పై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అధికార పార్టీ కార్యకర్తల్లా పోలీసుల తీరు: ఎర్రోళ్ల
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందునే బాల్క సుమన్ గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రభుత్వం తన అస్ర్తాలుగా వాడుకుంటున్నదని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడబోవని స్పష్టం చేశారు.
రాహుల్‌గాంధీ నోరు విప్పాలి: వాసుదేవరెడ్డి
నిత్యం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ క్యాతనపల్లి ఘటనపై నోరు విప్పాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ నాయకులు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. దీనిపై రాహుల్‌గాంధీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
భేషరతుగా విడుదల చేయాలి: బాల్‌రాజ్
బాల్క సుమన్ అరెస్ట్ అక్రమమని, ఆయనను భేషరతుగా విడుదల చేయాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తిని క్యాతనపల్లి పీఠంపై కూర్చోబెట్టేందుకు యత్నించడమే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించారు. వెంటనే సుమన్‌పై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే అరెస్ట్: కిశోర్‌గౌడ్
మంత్రి వివేక్ ప్రోద్భలంతోనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ నేత కిశోర్‌గౌడ్ మండిపడ్డారు. బాల్కసుమన్ అరెస్ట్‌ను ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పూర్తి మెజారిటీతో గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ అక్రమంగా మున్సిపల్ చైర్పర్సన్ పదవిని దక్కించుకొనేందుకు కుట్రలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.
ఎన్నికల సంఘం స్పందించాలి: కురువ
క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యబద్ధంగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అరెస్ట్ అప్రజాస్వామికం: సుర్వి యాదయ్యగౌడ్
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నాయకుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సరికాదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. బాల్క సుమన్ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
జగ్గారెడ్డికో చట్టం.. బాల్క సుమన్‌కు మరో చట్టమా?: మన్నె క్రిశాంక్
‘రాష్ట్రంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి ఓ చట్టం.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మరో చట్టం నడుస్తున్నదా? దీనిపై ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలె.. పోలీసు అధికారుల సంఘం నాయకులు నోర్లు విప్పాలె’ అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ హితవు పలికారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పోలీసులను దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని, ఈ ఘటన జరిగి వారం దాటినా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని, పోలీసు అధికారుల సంఘం నాయకులు సైతం నోరు మెదపడం లేదని పేర్కొన్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రజాప్రతినిధులను అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు యత్నించిన బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన ఇంటిపై వేలాది మంది పోలీసులు దాడులు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాయడమే: పల్లె రవికుమార్
క్యాతనపల్లి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామిక స్ఫూర్తిని కాలరాయడమేనని కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిన గద్దెనెక్కేందుకు యత్నించడం దుర్మార్గమని పేర్కొన్నారు. మహిళా కౌన్సిలర్లపై జరిగిన దౌర్జన్యంపై చర్యలు తీసుకోని పోలీసులు.. బాధితులైన బీఆర్ఎస్ నేతలపైనే కేసులు నమోదు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం కుట్రపూరితాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వ దమనకాండకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్పారని హెచ్చరించారు. పోలీసులు వెంటనే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.