జవహర్నగర్, మార్చి 23: కళాకారులను బీఆర్ఎస్ ఆదుకుని ఉద్యోగాలు కల్పిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను రోడ్డున పడేస్తుందని తెలంగాణ కళాకారుల వేదిక కమిటీ వ్యవస్థాపకులు కామల్ల ఐలన్న దుయ్యబట్టారు. కళాకారులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ కళాకారుల వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎర్రవల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జవహర్నగర్ కార్పొరేషన్లో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామల్ల ఐలన్న హాజరై రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు కళాకారులను మోసం చేశాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్న కళాకారులవైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కళాకరులకు సంక్షేమ నిధులు రూ. 1000కోట్ల కేటాయించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కళాకారులు సంఘటిత ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని, ప్రభుత్వం కల్చరల్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళాకారుల వేదిక రాష్ర్ట అధ్యక్షుడు మోహన్ బైరాగి, ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, రమేశ్, ఎర్ర మల్లేశ్, శరత్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు