ఖైరతాబాద్, మార్చి 6 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందుకు నిదర్శనం తన సామాజిక వర్గానికి చెందిన వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇప్పించుకోవడమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. శుక్రవారం సోమాజిగూడక ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సీటును బీసీ సామాజిక వర్గం నుంచి వినయ్‌కుమార్ లేదా ఎస్సీ సామాజిక వర్గం నుంచి దొమ్మాటి సాంబయ్యకు కేటాయించాల్సి ఉన్నదని, కానీ సీఎం రేవంత్ కుట్రలతో వేం నరేందర్‌రెడ్డికి దక్కిందని విమర్శించారు. రెండేండ్ల రేవంత్‌రెడ్డి పాలనలో మాదిగలు ఎక్కువగా నష్టపోయారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కంటే ముందు విడుదల చేసిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేస్తామని స్వయంగా అసెంబ్లీలో సీఎం ప్రకటించాడని, కానీ గత నోటిఫికేషన్లకు వర్గీకరణ లేకుండానే నియామకాలు చేపట్టి మరో దశాబ్దకాలం మాదిగలకు ఉద్యోగాలు రాకుం డా చేశాడని మండిపడ్డారు. వర్గీకరణలో సైతం 11% రిజర్వేష న్ల వాటా దక్కాల్సి ఉండగా, మాల సామాజికవర్గానికి చెందిన నాయకుల ఒత్తిడితో 9 శాతానికి కుదించాడని ఆరోపించారు. సీఎం కుట్రలతోనే చట్టసభల్లో మాదిగలకు అవకాశాలు రాకుండా పోతున్నాయని మండిపడ్డారు.
రాజేశ్ కేసులో దోషులపై చర్యలు తీసుకోండి
సూర్యాపేట పోలీసుల హింసలో లాకప్‌డెత్ అయిన కర్ల రాజేశ్ కేసులో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఏడీజీ పర్సనల్, మల్టీజోన్-2 ఇన్చార్జ్ డీఎస్ చౌహాన్‌కు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. రాజేశ్ మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తిచేసిన నేపథ్యంలో దర్యాఫ్తును వేగవం తం చేయాలని, సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తును జరిపి రాజేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ఇలాంటి లాకప్‌డెత్‌లు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.