న్యూఢిల్లీ : ఇరాన్‌పై అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలుపెట్టి గురువారానికి(మార్చి 5) 100 గంటలు పూర్తయింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌తో కలసి అమెరికా సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్యపై ప్రాణ నష్టం గురించి మాత్రమే గాక ఆర్థిక పర్యవసనాలపై నిపుణుల నుంచి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారీ స్థాయిలో చేపట్టే ఏ సైనిక చర్య అయినా చాలా ఖరీదుతో కూడుకున్నది. బలగాల మోహరింపు, అధునాతన ఆయుధాల వినియోగం, సుదీర్ఘకాల యుద్ధానికి సంసిద్ధంగా ఉండడం వంటివి యుద్ధంలో ఇమిడి ఉంటాయి. ఇందుకు ఇరాన్‌తో యుద్ధం ఏమాత్రం మినహాయింపు కాదు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ డాటాను ఉటంకిస్తూ ఇరాన్-కాస్ట్-టిక్కర్. కాం తెలిపిన వివరాల ప్రకారం మార్చి 6వ తేదీ నాటికి ప్రస్తుత యుద్ధం ఖర్చు 500 కోట్ల డాలర్లు(రూ. 45,000 కోట్లు). గత శనివారం ప్రారంభమైన యుద్ధం కోసం రోజుకు సగటున 100 కోట్ల డాలర్లను(రూ. 9,000 కోట్లు) అమెరికా ఖర్చు చేసినట్లు యుద్ధ వార్ కాస్ట్ ట్రాకర్ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. దీన్ని బట్టి సెకన్‌కు 11,574 డాలర్టు(రూ. 10.41 లక్షలు), గంటకు 1,16,66,667 డాలర్లు(రూ. 375 కోట్లు) అమెరికా ఖర్చు చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.
యుద్ధం కొనసాగితే వారానికి 300 కోట్ల డాలర్లను ప్రభుత్వ ఖజానా నష్టపోవలసి వస్తుందని ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. అల్‌జజీరా కథనం మేరకు 2023లో పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ మద్దతు గల హమాస్ మొదటగా ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఆ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ కలసి సంయుక్తంగా ఇరాన్‌పై రెండు సార్లు(2025 జూన్‌లో ఒకసారి, 2026 ఫిబ్రవరిలో మరోసారి) దాడులు చేశాయి. ఇందుకోసం అమెరికా ప్రభుత్వం దాదాపు 3,37,700 కోట్ల డాలర్లు(రూ. 3.03 లక్షల కోట్లు) ఖర్చు పెట్టింది.
శత్రు దేశాల క్షిపణి దాడులను అడ్డుకునే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి ప్రయోగించిన ప్రతిసారీ దాదాపు 40,000 డాలర్ల నుంచి 50,000 డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. భారీ దాడుల సమయంలో దీని నిర్వహణ వ్యయం లక్ష డాలర్ల నుంచి లక్షన్నర డాలర్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదటి 24 గంటల్లోనే దాదాపు 77.9 కోట్ల డాలర్లు(రూ. 7,011 కోట్లు) అమెరికా ఖర్చు చేసినట్లు తుర్కియేకు చెందిన వార్తాసంస్థ అనదోలు వెల్లడించింది. ఇరాన్‌పై దాడి చేయడానికి ముందు అమెరికా తన సైనిక సంపత్తిని ఇరాన్ చుట్టూ మోహరించింది. ఈ సన్నాహక దశ కోసం భారీ మూల్యాన్నే అమెరికా చెల్లించవలసి వచ్చింది. నౌకలు, విమానాలు, బలగాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. యుద్ధ సన్నాహక స్థితిలో ఈ సంపత్తిని ఉంచడానికి ఇంధనం, ఆహార సరఫరాలు, సిబ్బంది ముఖ్యం. వీటిని మోహరించడానికి ఖర్చు చేసిన వనరులను ఆర్థికాభివృద్ధికి లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వంటి అవసరాల కోసం వాడుకుని ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇరాన్ చుట్టూ యుద్ధ విమానాలను మోహరించడానికి అమెరికా ప్రభుత్వానికి అదనంగా రూ. 5,670 కోట్లు ఖర్చు అయి ఉంటుందని అల్‌జజీరా అంచనా వేసింది.
యుద్ధం మొదలు కావడానికి ముందు భూమి, ఆకాశం, సముద్రంపైన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికాకు రోజువారీ నిర్వహణ ఖర్చు 65 లక్షల డాలర్లు(రూ.58.5 కోట్లు)గా సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీస్ ఎస్టిమేషన్‌ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
బాంబులతో దాడులు, సైనిక బలగాల మోహరింపు వంటివన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవే. యుద్ధ సమయాల్లో క్షిపణులు, బాంబులు, విమానాలు, ట్యాంకులు, ఇతర సైనిక సంపత్తిని వేగంగా ఉపయోగించాల్సి ఉంటుంది. వాటిని తిరిగి భర్తీ చేసుకోవడం, మరమ్మతులు చేయడం వంటివి ఖర్చును మరింత పెంచుతాయి. సైనికుల వేతనాలు, వారికి ఆహారం సరఫరా, వారి ఆరోగ్య సంరక్షణ వంటివి అదనపు ఖర్చులు. ఒకవేళ యుద్ధం ముగిసినా శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, పునర్నిర్మాణ చర్యలు, యుద్ధంలో గాయపడిన సైనికుల సంరక్షణ వంటి దీర్ఘకాలిక ఒప్పందాల కారణంగా ఒక్కోసారి దశాబ్దాల పాటు వ్యయాన్ని ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.
ఇరాన్ చవకైన డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా ఖరీదైన క్షిపణులను ప్రయోగిస్తున్నది. యుద్ధం ప్రారంభమైన తొలి నాలుగు రోజుల్లో ఇరాన్ దాదాపు 2,000 డ్రోన్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది. షహీద్ వంటి రూ.18 లక్షలు ఖరీదైన ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేసేందుకు అమెరికా రూ.36 కోట్లు విలువైన పాట్రియాట్ పీఏసీ-3 క్షిపణిని ఉపయోగిస్తున్నదని బిటిన్నింగ్ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్ సహ వ్యవస్థాపకుడు కషీఫ్ పేర్కొన్నారు.