రామగిరి, జూన్ 13 : తెలుగు సాహిత్యంలో రైతు జీవితాన్ని మేరెడ్డి యాదగిరి రెడ్డి సమగ్రంగా ఆవిష్కరించారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, సృజన సాహితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మేరెడ్డి యాదగిరి రెడ్డి సాహిత్య సమాలోచన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ గత ఆరు దశాబ్దాలుగా నిబద్ధతతో అనేక ప్రక్రియలలో మేరెడ్డి యాదగిరిరెడ్డి సాహిత్య సృజన చేశారని కొనియాడారు. ముఖ్యంగా కథా సాహిత్యంలో తెలంగాణ గ్రామీణ పల్లెను గ్రామీణ జీవితాన్ని రైతుల జీవితాలను చక్కగా చిత్రించారన్నారు.
డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నవలా రచయిత శిరంశెట్టి కాంతారావు మాట్లాడుతూ.. మేరెడ్డి యాదగిరి రెడ్డి అట్టడుగు వర్గాల జీవితాలను సాహిత్య కాన్వాస్ పై ఆవిష్కరించారన్నారు. పాలపిట్ట సంపాదకుడు గుడిపాటి మాట్లాడుతూ తెలుగు కథా సాహిత్యంలో మేరెడ్డి యాదగిరిరెడ్డి తనదైన ముద్రవేశారన్నారు. నాలుగు సెషన్లుగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత శీలం భద్రయ్య, మేరెడ్డి యాదగిరి రెడ్డి కథలు రైతు జీవితం అనే అంశంపై ప్రసంగించారు. డా.పొట్టబత్తుల రామకృష్ణ మేరెడ్డి యాదగిరి రెడ్డి కవిత్వం అనే అంశంపై ప్రసంగించారు. డా.ఉప్పల పద్మ ‘మేరెడ్డి యాదగిరిరెడ్డి బాలసాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు. డాక్టర్ సి.అనిత కుమారి మేరెడ్డి మినీ కవిత్వం వస్తు శిల్పాలు అనే అంశంపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం, అలుగుబెల్లి రామచంద్రారెడ్డి, భూతం ముత్యాలు, వల్లాల అచ్చయ్య పరందాం, బైరెడ్డి కృష్ణారెడ్డి, పున్న అంజయ్య, బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టే శంకర్రావు, ఓరుగంటి పురుషోత్తం, కుకుడాల గోవర్ధన్, డాక్టర్ మొహమ్మద్ హసేన, డాక్టర్ చింతోజు మల్లికార్జున చారి, డాక్టర్ పగడాల నాగేందర్, శీల అవిలేను, డాక్టర్ సాగర్ల సత్తయ్య, ముక్కామల జానకిరామ్, మెంతబోయిన సైదులు, దాసరి శ్రీరాములు, బండారు శంకర్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, జిల్లా మహేందర్, చెరుపల్లి సంధ్య, తరుణోజు భీష్మాచార్య, శ్రీకళా రామ్మూర్తి పాల్గొన్నారు.