AP News : ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన జగన్‌ను మించిన వెన్నుపోటుదారుడు మరొకరు లేరని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘వెన్నుపోటుకు, గొడ్డలివేటుకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్’ అని ఆయన అభివర్ణించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తుంగలో తొక్కిన దుర్మార్గుడు జగన్ అని రవీంద్ర విమర్శించారు.
సొంత బాబాయి హత్య కేసులో నిందితులకు కొమ్ముకాస్తూ, తోడబుట్టిన చెల్లిపైనే నిందలు వేసిన నీచమైన మనస్తత్వం జగన్‌ది అని మంత్రి ఆరోపించారు. ఆయన ఐదేళ్ల అరాచక పాలన, మోసపూరిత వైఖరిని చూసిన ప్రజలు ‘ఈ సైకో మాకొద్దు’ అంటూ ఎన్నికల్లో కూటమికి 94 శాతం సీట్లు కట్టబెట్టారని గుర్తుచేశారు. కేవలం 11 సీట్లకే పరిమితమైనా సిగ్గులేకుండా ఇంకా కుట్రలనే నమ్ముకుని, ప్రజాసంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వంపై నీచమైన కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్ తన పాలనను ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించారని, సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని గాలికి వదిలేసి, కల్తీ బ్రాండ్లు, సొంత కంపెనీల మద్యంతో ప్రజల జేబులు కొల్లగొట్టి తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకున్నారని ఆరోపించారు.
ఈ కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో సుమారు 30 వేల మంది మహిళలు మాంగళ్యాలు కోల్పోయారని, లక్షలాది మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మంత్రి రవీంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని, పీపీఏలు రద్దుచేసి విద్యుత్ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్ల నష్టం కలిగించారని విమర్శించారు. మెగా డీఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ యువతను దారుణంగా మోసం చేశారని, జగన్ రెడ్డి దగాకోరు మాటలవల్ల గత ఐదేళ్లలో 4100 మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.