(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా 50 యుద్ధ విమానాలతో ఖమేనీ అధ్యక్ష కార్యాలయం కిందనున్న రహస్య బంకర్‌ను ఇజ్రాయెల్ ముక్కలు చేసేసింది. మరోవైపు, ఇరాన్ డ్రోన్ వాహక నౌకపై అమెరికా దాడులు చేయగా, దానికి ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. ఇంకోవైపు, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, అప్పుడే చర్చల గురించి ఆలోచిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 200 మంది చిన్నారులు మరణించారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్లో అత్యధికంగా 181 మంది మృతి చెందినట్టు వెల్లడించింది. ఇరాన్లో 3000 ఇండ్లు నాశనమైనట్టు ఇరానీయన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలిపింది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో వారం కిందట మొదలైన ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇటీవలి అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అధ్యక్ష కార్యాలయం కిందనున్న రహస్య బంకరే లక్ష్యంగా శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. 50 యుద్ధ విమానాలతో ఆ బంకర్‌ను తునాతునకలు చేశాయి. ఖమేనీ మృతి తర్వాత ఈ బంకర్‌ను ఉన్నతాధికారులు వినియోగించే అవకాశం ఉన్నదని, అందుకే దాన్ని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఇరాన్ డ్రోన్ వాహక నౌక లక్ష్యంగా అమెరికా భీకర దాడులు జరిపింది. దీంతో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. దాడుల అనంతరం స్పందించిన అమెరికా సెంట్రల్ కమాండ్.. ఇరాన్ నేవీ మొత్తాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకూ ఇరాన్‌లోని 200 లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు అమెరికా ప్రకటించింది. మరోవైపు, ప్రస్తుత యుద్ధం మరో దశకు చేరిందని, ఇరాన్‌పై మరిన్ని మెరుపు దాడులు చేయనున్నట్టు ఐడీఎఫ్ చీఫ్ అయాల్ జమీర్ హెచ్చరించారు. లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపింది.
అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. జోర్డాన్, యూఏఈలోని రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసింది. అంతకుముందు ఖతార్‌లోనూ అత్యంత శక్తివంతమైన రాడార్ కేంద్రాన్ని కూడా పేల్చేసింది. ఇరాక్‌లోని ఎర్బిల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని అమెరికా మిలిటరీ స్థావరంతో పాటు కువైట్‌లోని మరో అమెరికా స్థావరంపై దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. కువైట్, బహ్రెయిన్ రాజధాని మనామాలో పెద్దయెత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదిలాఉండగా టెల్అవీవ్ నగరం మీదుగా ఇరాన్ ఖైబర్, ఫాటా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్అవీవ్ నగరంలో రోజంతా సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియాన్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇరాన్ క్షిపణితో దాడులు జరిపిందని స్థానిక మీడియా పేర్కొన్నది. తమ దేశంలోకి చొరబడాలని ప్రయత్నిస్తే దాడులకు వెనుకాడబోమని ఇరాక్‌లోని కుర్దీషియన్లకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.
ఖమేనీని అడ్డు తొలగించాలని తాము గత నవంబర్లోనే నిర్ణయించినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్య 2026 మధ్యలో జరుగాల్సి ఉన్నదని, అయితే, ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగడంతో ఆపరేషన్‌ను ముందస్తుగా చేపట్టినట్టు వెల్లడించారు.
ఇరాన్‌పై పని ముగించిన తర్వాత క్యూబా సంగతి తేల్చుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. క్యూబాతో అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నట్టు తెలిపారు. తమ దాడులతో ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్థ్యాలు భారీగా క్షీణించాయన్నారు.
మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న రియల్ టైమ్ సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేస్తున్నదని, ఈ క్రమంలోనే ఇరాన్ కచ్చితత్వంతో వాటిపై దాడులు చేయగలుగుతున్నదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ముగ్గురు అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో వెల్లడించింది.
వాషింగ్టన్: బేషరతుగా లొంగిపోవడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌తో యుద్ధం తీవ్రbవుతున్న క్రమంలో ఆ దేశం పట్ల తనకున్న కఠిన వైఖరిని ట్రంప్ మరోసారి ప్రకటించారు. ‘ఆ దేశం బేషరతుగా లొంగిపోవడం తప్ప దానితో ఎలాంటి ఒప్పందం లేదు’ అని పేర్కొన్నారు. ఏదైనా దౌత్య మార్గం ఏర్పడటానికి ముందు టెహ్రాన్ లొంగిపోవాల్సి ఉంటుందన్నారు. ‘ఆ దేశానికి గొప్ప, ఆమోదయోగ్యమైన నాయకుడి ఎంపిక తర్వాత మేము, మా మిత్రులు, భాగస్వాములు కలిసి ఇరాన్‌ను విధ్వంసం అంచు నుంచి తిరిగి తీసుకురావడానికి అవిశ్రాంతిగా కృషి చేస్తాం’ అని ఆయన అన్నారు. కాగా, దౌత్యపరమైన మార్గాల పట్ల ఇరాన్ ఇంకా ఆశాభావంతో ఉంది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించడానికి కొన్ని దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ తెలిపారు.