CNG | సిటీబ్యూరో, ఫిబ్రవరి 20: వాహనాల్లో నింపే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధర దూకుడు మీదుంది. పెట్రోల్, డీజిల్ ధరల దరిదాపుల్లోకి ఇదీ చేరుతోంది. ప్రస్తుతం సీఎన్ జీ కిలో ధర రూ. 96కు చేరగా, ఆటో గ్యాస్ రూ.51.02కు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి.
మహా నగరంలో వాహనాల సంఖ్య అక్షరాలా 82 లక్షలు దాటిపోయింది. అందులో సుమారు 14.35 లక్షల వరకు కార్లు ఉండగా, 1.46 లక్షల ఆటోరిక్షాలు, 80 వేల క్యాబ్ లు ఉన్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజు 5000 ఆటోలు, 1000 వరకు కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్ జీ కిట్స్ సామర్థ్యం ఒక్కో స్టేషన్ కు ప్రతిరోజు 6 వేల కిలో వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది.
పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్ జీ, ఆటో గ్యాస్ తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్ జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలో ఒక్కంటికి 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. దీంతో వీటి ధర పెరిగినా డిమాండ్ ఏమ్రాతం తగ్గడంలేదు.