పెర్త్: భారత్‌తో ఏకైక టెస్టుపై ఆస్ట్రేలియా మరింత పట్టు బిగించింది. గులాబీ బంతితో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టు పోరులో కంగారూలు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. 125 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు భారత్ శనివారం ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 105 పరుగులకు పరిమితమైంది. లూసీ హామిల్టన్(3/32), అనాబెల్ సదర్లాండ్(2/15) ధాటికి మన అమ్మాయిలు నిలదొక్కుకోలేకపోయారు. పచ్చిక పిచ్‌పై పేస్‌తో చెలరేగిన ఆసీస్ పేసర్లు..వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. ప్రతీకా రావల్(43 నాటౌట్) ఆసీస్‌కు ఎదురొడ్డి నిలువగా, మిగతా బ్యాటర్లు మందన(2), షెఫాలీ(5), రోడ్రిగ్స్(14), కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(11), దీప్తిశర్మ(9), రీచా ఘోష్(0) ఘోరంగా విఫలమయ్యారు. ప్రతీకతో పాటు స్నేహ్ రానా(14 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న భారత్ 20 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 96/3తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 323 పరుగులకు ఆలౌటైంది. అన్నాబెల్ సదర్లాండ్(129) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. సయాలీ సత్గరె(4/50) నాలుగు వికెట్లతో రాణించింది.