Hyderabad | జవహర్‌నగర్, ఏప్రిల్ 8: హైదరాబాద్‌లోని యాప్రాల్‌లో దారుణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడని తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఓ యువకుడిని అతని స్నేహితుడు చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు.
జవహర్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్ భగత్‌సిగ్ కాలనీలో నివాసం ఉండే పుల్లూరి ప్రణీత్ (21), గోవర్దన్(27) ఇద్దరూ స్నేహితులు. అయితే తాను గంజాయి అమ్ముతున్నాడని కాలనీలో దుష్ప్రచారం చేస్తున్నాడని ప్రణీత్‌పై గోవర్దన్ కోపం పెంచుకున్నాడు. దీంతో అతనికి ఎలాగైనా బుద్ధిచెప్పి తన జోలికి రాకుండా చేసుకోవాలని గోవర్దన్ భావించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 5వ తేదీ రాత్రి 9.20 గంటల ప్రాంతంలో గోవర్దన్ (27), జశ్వంత్ (20), విన్సెంట్ (19) ముగ్గురు కలిసి ప్రణీత్‌తో మాట్లాడాలని బయటకు తీసుకెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న గోవర్దన్, జశ్వంత్‌లు ప్రణీత్‌ను స్థానికంగా ఉన్న ఫుట్‌బాల్ మైదానానికి తీసుకెళ్లాడు. అక్కడ చేతులతో పిడిగుద్దులు గుద్దడమే కాకుండా కర్రలతో ప్రణీత్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రణీత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కంగారుపడిన స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు.
తీవ్ర గాయాలతో పడి ఉన్న ప్రణీత్‌ను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అలాగే ప్రణీత్‌ను ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 6వ తేదీన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.