గురువారం 13 ఆగస్టు 2020
Peddapalli - Aug 01, 2020 , 01:49:57

ఆహ్లాదవల్లి.. గుండన్నపల్లి

ఆహ్లాదవల్లి.. గుండన్నపల్లి

ఊరంతా పచ్చని చెట్లు     

దారులకు హరిత తోరణం 

బోయినపల్లి: అందమైన చెట్లు.. ఆకు పచ్చని తోరణాలను తలపిస్తున్న దారులతో గుండన్నపల్లి ఆహ్లాదాన్ని పంచుతున్నది. హరితహారం ఐదు విడుతల్లో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఊరంతా పచ్చదనం పరుచుకుంది. ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళా సంఘాలు వాడవాడనా మొక్కలు నాటగా, గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధ చూపి వాటికి రోజూ నీరు పట్టిస్తూ కంటికి రెప్పలా కాపాడారు. గన్నేరు, గులాబీ, ఏడు ఆకుల, గుల్‌మోహర్‌, కానుగ, అడవి తంగేడు మొక్కలు నాటగా ఇప్పుడు చక్కగా పెద్దగా పెరగడంతో గ్రామానికి కొత్త సొబగులు సంతరించుకున్నాయి. రహదారులన్నీ పూల చెట్లతో స్థానికులకు ఆహ్వానం పలుకుతున్నాయి.  

సమష్టి సహకారంతో మొక్కలు నాటాం

స్వశక్తి మహిళలు, వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజల సమష్టి సహకారంతో గ్రామంలో అన్ని రకాల మొక్కలు నాటాం. ప్రధాన రహదారులతో పాటు అన్ని రోడ్ల పక్కన పూల మొక్కలు నాటినప్పటి నుంచి ప్రజల పూర్తిగా సహకరించడంతో అవి ఏపుగా పెరిగాయి. హరితహారంలో దాదాపు పలు రకాల మొక్కలు నాటి పెంచాం.  ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు గ్రామం పూల చెట్లతో కళకళలాడుతున్నది.

-సర్పంచ్‌ కొప్పుల లక్ష్మి, గుండన్నపల్లి

 హరితహారం చక్కని కార్యక్రమం

హరితహారం చాల చక్కని కార్యక్రమం. గుండన్నపల్లి గ్రామస్థులందరం భాగస్వాములై మొక్కలు నాటుకుని సంరక్షించుకున్నం. గ్రామంలో రహదారుల పక్కన ఏపుగా పెరిగిన చెట్లు పల్లె ప్రగతిని చాటుతున్నయ్‌. చక్కని గాలి, ప్రశాంతమైన వాతావరణంతోపాటు, రహదారులు కూడా అందంగా కనిపిస్తున్నయ్‌. హరితహారంతో గ్రామం పూల వనంగా మారింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది.

-రాద అంజయ్య, మాజీ ఉప సర్పంచ్‌,  గుండన్నపల్లి


logo