CM KCR | మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ నిర్వహించిన కాంధర్ లోహా సభకు మరాఠా ప్రజానీకం పోటెత్తింది. ఉసిళ్లపుట్ట పగిలినట్లుగా.. చీమల బారులా జనం కదలివచ్చింది. ఆడా మగా.. ముసలీ ముతక.. రైతు.. కూలీ.. వ్యాపారి.. ఉద్యోగి అనే తారతమ్యం లేకుండా తరలివచ్చింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దారి పొడవునా నీరాజనం పలికింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం’ ప్రతీ గొంతులో ప్రతిధ్వనించింది. గులాబీ జెండాను ప్రతీ గుండె హత్తుకున్నది. ఎలా సాధ్యమైంది? ఇంతటి అభిమానం. అవ్యాజ్యమైన ప్రేమ? ఎవరు వారిని పురికొల్పుతున్నారు? వారికి ఎవరేం చెప్తున్నారు? వారేం చూశారు? చూస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? ఏ శక్తి వారిని నడిపిస్తున్నది? అన్నవే ఇప్పుడు అసలుసిసలైన ప్రశ్నలు. కొంచెం లోతుగా.. మరికొంచెం విశాలంగా చర్చించుకోవాల్సిన అంశాలు.
దేశంలో నేడు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పనలవి కావు. అందులో మహారాష్ట్ర రైతులది కడు దయనీయ పరిస్థితి. గడిచిన రెండు దశాబ్దాలలో అక్కడ 70 వేల మందికిపైగా ఆత్మహత్య చేసుకుంటే అందు లో 75 శాతం మంది రైతులు ఒక్క విదర్భ, మరఠ్వాడ ప్రాంతంలోని 14 జిల్లాలకు చెంది న వారేనన్నది చేదు నిజం. అవన్నీ ప్రభుత్వ గణాంకాలే. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి.. ఆదుకునేవారే లేక ఎన్ని వేల కుటుంబాలు చితికిపోయాయో? ఎంతమంది జీవితాలు వీధిన పడ్డాయో? ఎందరి చిన్నారులు కార్ఖానాల్లో.. హోటళ్లలో ఇత్యాది పనుల్లో జీతాలకు కుదిరిండ్లో? కుటుంబ కాడి మోయలేక.. దించలేక.. తనువు చాలించలేక ఎంతమంది ఆడబిడ్డలు యాతన అనుభవిస్తున్నారో? చెప్పాలంటేనే పాణం అవిసిపోతున్నది.
కళ్లు చెమ్మగిల్లుతున్నవి. గుండె బరువెక్కుతున్నది. అంతటి బీతావహ పరిస్థితి నెలకొన్నా అక్కడి ఏలికలకు నెనరన్నది లేకపోవడమే పెను విషాదం. వాగ్దానాలు ఇవ్వడం.. ఆపై ఎగనామం పెట్టడం పరిపాటిగా మారింది. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. ఇట్లాం టి దైన్య పరిస్థితుల నేపథ్యంలోనే 2018 మార్చిలో 50 వేల మంది రైతులు నాసిక్ నుంచి ముంబై వరకు 180 కిలోమీటర్ల లాంగ్‌మార్చ్ చేపట్టారు. 7 రోజుల ఆ యాత్రలో పాదాలు బొబ్బలెక్కి, చిట్లి నెత్తురోడినా, గసపోస్తూనే ఘాట్‌రోడ్లను ఎక్కిదిగుతూ ముందుకుసాగారు తప్ప వెనకడుగు వేయలేదు. ముంబై వాసుల మనసు గెలుచుకున్నారే తప్ప రైతాంగానికి సర్కారు నుంచి లభించిన ఉపశమనం మాత్రం శూన్యం. రైతుల డిమాండ్లపై హుటాహుటిన ఆరుగురు సభ్యులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని అటకెక్కించింది. సరిగ్గా ఐదేండ్ల తర్వాత అదే మార్చి మాసం.. మళ్లీ అదే బీజేపీ సర్కారు.. అదే రైతుల లాంగ్‌మార్చ్.. తిరిగి అదే వాగ్దానం పునరావృతం కావడం అక్కడ నిత్యకృత్యమైంది. స్థూలంగా ఇది మరాఠా రైతాంగం దైన్య పరిస్థితి.
మరోవైపు సాంస్కృతిక వారసత్వాలు భిన్నమైనవే కావచ్చు.. తిండి, ఠికానా వేరు కావచ్చు. అభిరుచుల్లో వ్యత్యాసం ఉండవచ్చు. కానీ మహారాష్ట్ర, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు మాత్రం ఒక్కటే. తాగు, సాగునీటి కోసం పడిన వెంపర్లాటలు ఒక్కటే. పొట్ట చేతపట్టుకొని పాలమూరు బిడ్డలు, మరఠ్వాడ తండ్రులు చేరిన గమ్యం ఒక్కటే. అది పుణేలోని బాలేవాడి కావచ్చు.. లేదంటే బీవండి, బొంబాయి అడ్డాల పేర్లు వేరు కావచ్చు కానీ సాగించిన బతుకుపోరు ఒక్కటే. వలపోత ఒక్కటే. వేదనలు, సంవేదనలు, నిర్వేదాలు, నిట్టూర్పులు ఒక్కటే.
దివారాత్రులు కార్చిన కన్నీళ్లు ఒక్కటే. కలలుగన్న జీవితం ఒక్కటే. చివరాఖరికి సమస్యలపై పాలకుల విస్మరణ కూడా ఒక్కటే. కానీ గడిచిన తొమ్మిదేండ్లలో మాత్రం అక్కడా ఇక్కడ సంభవించిన మార్పుల్లో మాత్రం జమీన్ ఆస్మాన్ ఫరక్ వైరుధ్యం. గతాన్ని వర్తమానాన్ని ఏ మాత్రం సరిపోల్చుకోలేనంత, సారూప్యతే లేనంత స్పష్టమైన వ్యత్యా సం. మరఠ్వాడ ఇప్పటికీ సుప్త చేతనావస్థలోనే మగ్గిపోతుండగా, తెలంగాణ జవనాశ్వమై పరుగులుదీయడం గాలివాటు గమనమేదీ కాదు. కాకతాళీయం అంతకన్నా లేదు. తెలంగాణకు అల్లాఉద్దీన్ అద్భుత దీపమేదీ దొరకలేదు. మయామశ్చీంద్రాలేమీ చేయలేదు. ఉన్న వ్యత్యాసమల్లా ఏలికల సంకల్పాల్లోనే.. ఉదాత్త నాయకత్వంలోనే.. దీక్షా పట్టుదలల్లోనే.. మట్టిపై, మట్టిమనుషులపై చూపుతున్న నెనరులోనే. అందుకు అక్కడా ఇక్కడా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు, తత్ఫలితంగా సాధిస్తున్న నిర్మాణాత్మక, గుణాత్మక ప్రగతి సూచికలే తార్కాణాలు.
People
తెలంగాణ అస్తిత్వ బావుటాను ఎగరేసిన రోజునే అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నది. వలసాధిపత్య శక్తుల నిర్లక్ష్యంతో శిథిలమైన జీవనసౌధాన్ని మొక్కవోని చైతన్యస్ఫూర్తితో.. పేదలే కేంద్రబిందువుగా వినూత్న నిర్ణయాలతో.. విప్లవాత్మక సంస్కరణలతో.. 75 ఏండ్ల స్వతంత్ర భారతావని అమలుచేయని నమూనాతో పునర్నిర్మించుకోవడం ప్రారంభించి ప్రత్యేకతను చాటుకున్నది. అయినా పక్కపక్కనే… సరిహద్దు రేఖలకు ఇరువైపులా సంభవించిన మార్పులను ఎవరు ఎవరికి చెప్పాలి? పనిగట్టుకొని ఒకరు ప్రచారం చేయాలా? సాంకేతికతను అడ్డుకోగలరమో కానీ వ్యాపార వర్గాలతో, బంధుత్వాలతోపాటు, అటూఇటూ బట్వాడా అవుతున్న సరుకులతో పాటు సహజసిద్ధంగా రవాణా అవుతున్న సమాచారాన్ని ఎవరైనా నిలువరించగలరా? సరిహద్దుల్లో నిలబడి చూస్తే గోచరించే విభిన్న దృశ్యాలకు ఏమైనా తెరలు కట్టగలరా? అనుభవంలోకి వచ్చిన సత్యాలను అసత్యాలని కొట్టిపారేయగలరా? ఒకనాడు తమలాగే ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలతో తండ్లాడిన నేలపై తెర్లయిన జీవితాలు తెల్లబడుతున్న జీవనరీతులను చూస్తున్న వారిలో కొత్త ఆశల విత్తులు మోసులెత్తకుండా అడ్డుకోగలరా? నీళ్లు లేక ఎండిన బోర్లు నిండుగా పోస్తున్న.. పడావుబడి నెర్రెలిడిసిన బీళ్లలో పరుచుకుంటున్న పచ్చదనం దృశ్యాలను చూస్తూ పరితపించిపోతున్న ప్రాణాలను పక్కదారి పట్టించగలతరమా? దిన దిన ప్రవర్ధమానమవుతున్న ప్రగతి ప్రచండభానుడి కాంతి పుంజాలను బంధించసాధ్యమా? శిశిరంలో ఊరించే వసంతాలను లేశ మాత్రమైనా చర్చించుకోకుండా ఉండగలమా? అంటే అది ముమ్మాటికీ అసాధ్యం.
ఇప్పుడు సమస్త రంగాల్లో తెలంగాణ ఎగరేస్తున్న విజయకేతనాలపై యావత్ భారతావనిలో ఇదే చర్చ కొనసాగుతుండటమే కాదు, ప్రతి మదినీ తట్టి లేపుతున్నది. ఇలాంటి నేపథ్యంలోనే యావత్ దేశ రైతాంగం తెలంగాణ మాడల్‌ను గీటురాయిగా నిలుపుకొంటున్నది. ఆ తరహా సంక్షేమాన్ని కలగంటున్నది. ఆ పథకాలనే డిమాండ్లుగా ముందుకు తోస్తున్నది. ప్రగతితో మమేకమవుతున్నది. ఢిల్లీ వైపు చూడటం మానుకొని తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నది. కేసీఆర్‌పైనే ఆశలను నిలుపుకొన్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ పిలుపునందుకుంటూ చైతన్యవంతమవుతున్నది. తమ మదిలోని ప్రశ్నలను, ఆర్తిని, రగులుతున్న ఆక్రోశాన్ని కేసీఆర్ గొంతు పలుకుతుంటే పూనకంతో ఊగిపోతున్నది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలకు పోటెత్తిన రైతాంగమే అందుకు నిదర్శనం. అది రేపు భావిభారతాన సంభవించనున్న పెను మార్పులకు తొలి సంకేతం.
మ్యాకం రవికుమార్
91827 77621