నిజం నిప్పు లాంటిది. దానికి చెద పట్టదు. ముట్టుకుంటే కాలుతుంది కూడా. ఈ నిజమెరుగని కాంగ్రెస్ ప్రభుత్వం చీటికిమాటికి నిప్పులో కాలేస్తున్నది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులపాలు చేయాలని ప్రయత్నిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీల మాటలను ప్రజలు మర్చిపోవాలని మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్ కేసు వంతు వచ్చింది. ఈ ఆరోపణల వల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జరిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆయన నిప్పు లాంటి మనిషి. ఇది ప్రజలకూ తెలుసు. ఫార్ములా ఈ-రేస్ కేసులో వస్తున్న ఆరోపణలన్ని ఉత్తవేనని అన్ని ఆధారాలతో సహా కేటీఆర్ గతంలోనే నిరూపించారు. అయినా, కాంగ్రెస్ నాయకులు పాత పాటే పాడుతున్నారు. కేటీఆర్ ప్రభుత్వ నిబంధనలను ఎక్కడా అతిక్రమించలేదు. రూ.50 కోట్ల ప్రభుత్వ నిధులను వృథా చేయలేదు.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. కేవలం పదేండ్ల కాలంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేటీఆర్‌దే. కానీ, కాంగ్రెస్ నాయకులకు ఈ అభివృద్ధి కనిపించడం లేదు. అయినా గోతులు తవ్వడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. ప్రజల కోసం పనిచేసే నాయకులపై ప్రజాక్షేత్రంలో దుమ్మెత్తిపోయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందుకే ఈ కుట్రలు చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీలు రెండు వేర్వేరు పార్టీలు కావచ్చు. వాటికి రెండు వేర్వేరు కార్యాలయాలు ఉండొచ్చు. కానీ, ఆ కార్యాలయాల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ మాత్రం ఒక్కటే. ఆ పార్టీల జెండా రంగులు వేరు కావచ్చు కానీ, వాటి ఎజెండా మాత్రం ఒక్కటే. అదే బీఆర్ఎస్ నాయకత్వాన్ని నైతికంగా దెబ్బతీయాలనుకోవడం. అందుకే ఆ పార్టీలు తగిన ప్రణాళికను ఉమ్మడిగా రచించుకుంటున్నాయి. అంతేకాదు, ఈ రెండు జాతీయ పార్టీల నేతల మైత్రి ఎంతో బలమైనది. గతంలో గవర్నర్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య సఖ్యత లేదు. కేసీఆర్ సర్కార్‌ను గత గవర్నర్ ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు. అందుకే, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలను నాటి గవర్నర్ ఎదుర్కొన్నారు. కేంద్ర కక్షపూరిత వైఖరి వల్లనే బీజేపీయేతర రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులను గవర్నర్లు తీవ్ర ఇబ్బందుల పాల్జేశారనే ఆరోపణలను మనం విన్నాం. కానీ, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రధానితో సహా కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు చకచకా దొరుకుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం నుంచి వచ్చే దస్ర్తాలకు వెంటనే గవర్నర్ ఆమోదం తెలుపుతున్నారు. ఎంతటి మార్పు! కాంగ్రెస్, బీజేపీల మైత్రి బంధాన్ని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రలు తేటతెల్లమవుతున్నాయి. ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ప్రజలు గమనిస్తున్నారు. కర్రుకాల్చి కాంగ్రెస్, బీజేపీలకు వాతపెట్టడమే ఇక మిగిలి ఉంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకురాలు)
–బోయినపల్లి సత్యవతి