జనగామ, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీయిజం.. గూండాయిజంతో బరితెగించారు. సోమవారం పోలీసుల అండతో రెచ్చిపోయి చైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. అధికారపార్టీతో కుమ్మక్కైన పోలీసులు తప్పుడు కేసును సాకుగా చూపి తనిఖీలు.. విచారణ పేరిట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ హాల్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ల బస్సు ముందుకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టించారు.
మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎక్స్అఫీసియో సభ్యుడి హోదాలో హాజరైన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఓటమి భయంతో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక వాయిదాకు పట్టుబట్టి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మెజార్టీ సభ్యులు హాజరవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేసిన ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జనగామ ఆర్డీవో గోపిరాంపై ఎన్నిక వాయిదాకు పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. అయినా, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సమావేశాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించినా ప్రభుత్వ పెద్దల ద్వారా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి ఎన్నికను ఈనెల 17న (మంగళవారం) వాయిదా వేయించారు.
జనగామ పోలీసుల ఓవరాక్షన్..
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో శిబిరంలో ఉన్న 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మద్దతు తెలిపిన ఇద్దరు స్వతంత్రులతో కలిసి సోమవారం ఉదయం 8గంటలకు జనగామకు బయలుదేరిన ప్రత్యేక బస్సును కాంగ్రెస్ పార్టీ గూండాలు, రౌడీ షీటర్లు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆర్అండ్బీ అతిథిగృహం చౌరస్తా వద్ద జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ భారీ ఎత్తున పోలీసు బలగాలతో బస్సును అడ్డుకున్నారు. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను కిడ్నాప్ చేశారని, ఆమె సమీప బంధువు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైన దృష్ట్యా ఆమెను విచారించాలంటూ మహిళా కానిస్టేబుళ్లతో వచ్చి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కిడ్నాప్ అయిందన్న అభ్యర్థిని పిలిచి బస్సులోంచి డీసీపీతో మాట్లాడించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను బీఆర్ఎస్ బీ-ఫారంపై గెలిచి భర్త అనుమతితో శిబిరంలో ఉన్నానని, తప్పుడు ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవద్దని సదరు అభ్యర్థి స్పష్టం చేసింది. అయినా వినకుండా డీసీపీ రాజమహేంద్రనాయక్ సహా పోలీసులు ముస్లిం మైనార్టీ మహిళా కౌన్సిలర్‌పై దురుసుగా ప్రవర్తించి అవమానకరంగా వ్యవహరించారు.
దీంతో డీసీపీ తీరును ఎమ్మెల్యే పల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళపై పోలీసుల ప్రవర్తన ఆక్షేపనీయమని, ఆమెను పోలీసుల వెంట పంపేది లేదని.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.. అభ్యర్థి స్వయంగా నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని మీకు తప్పుడు ఫిర్యాదు చేశారని చెబుతున్నా వినకుంటే.., మీ ఉద్యోగం పోతుంది.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. డీసీపీ తీరుపై రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ), రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ల బస్సును పోలీసులు అడ్డుకున్నారనే సమాచారంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది బీఆర్ఎస్ సైనికులు వాహనానికి రక్షణ వలయంగా నిలబడ్డారు.
దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు కార్యకర్తల కాళ్లు, చేతులు విరిగాయి. కాగా, ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు, పోలీసులు కాంగ్రెస్ గూండాలతో కుమ్మక్కై ఎన్నిక వాయిదా వేయించారని ఆరోపిస్తూ, జనగామ ఆర్డీవో వైఖరి, జనగామ డీసీపీ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా 12 మంది బీఆర్ఎస్కు కౌన్సిలర్లు ఇద్దరు స్వతంత్రులు మున్సిపల్ కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారం ముందు మెట్లపై కూర్చొని పెద్దఎత్తున నిరసనకు దిగారు. కాంగ్రెస్ గూండాల్లారా ఖబర్దార్.. వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు, పోలీసులు ఖబర్దార్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మెజార్టీ సభ్యుల మద్దతు ఉండి సభ్యులంతా హాజరైనప్పటికీ తప్పుడు కేసును చూపి ఎన్నికను అడ్డుకున్నారని, అధికారులు సైతం వత్తాసు పలికి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.