న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పెండ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి పూర్తిగా అపరిచితులు అని, వివాహానికి ముందు శారీరక సంబంధం ఏర్పరచుకొనే విషయంలో వారిద్దరూ బాగా ఆలోచించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పెండ్లి చేసుకుంటానని బూటకపు వాగ్దానం చేసి లైంగిక సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తికి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ సూచన చేసింది. బాధిత యువతికి 2022లో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పరిచయమైన నిందితుడు పెండ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. ఢిల్లీలో పలుమార్లు అతనితో ఏకాంతంగా గడిపిన యువతి ఆ తరువాత అతనితో దుబాయ్ కూడా వెళ్లింది.
అయితే నిందితునికి అంతకుముందే ఒకసారి వివాహం జరిగిందని, తిరిగి 2024లో రెండో పెండ్లి చేసుకున్నాడని యువతి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వారిద్దరూ ఏకాంతంగా గడిపిన సమయాన్ని కూడా నిందితుడు వీడియో తీసి యువతిని బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపించారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ‘ఉభయుల మధ్య పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఏర్పడినట్టు తెలుస్తున్నది. మేం పాతకాలం వారమై ఉండవచ్చు. కానీ పెండ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులే కదా. అలాంటప్పుడు వివాహానికి ముందు శారీరక సంబంధం ఏర్పరచుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండ్లికి ముందే ఇలా శారీరక సంబంధం ఎలా ఏర్పరచుకుంటారో మాకు అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘అమ్మాయి, అబ్బాయి జాగ్రత్తగా ఉండాలి.
ఎవరూ ఎవరిని పెండ్లికి ముందే నమ్మకూడదు’ అని పేర్కొన్నారు. ఆ యువతి దుబాయ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని నిలదీశారు. చూస్తుంటే ఇది ఉభయుల మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం కొనసాగినట్టు తెలుస్తున్నదని, అందువల్ల వారిని మధ్యవర్తిత్వం కోసం పంపుతామని తెలిపారు. ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉన్న ఇటువంటి కేసుల్లో విచారణ జరిపి, శిక్షలు వేయకూడదని అన్నారు. బాధితురాలికి ఏమైనా పరిహారం చెల్లించగలరేమో చూడాలని నిందితుని తరఫు న్యాయవాదికి సూచించారు. ఈ కేసును మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించాలని బాధితురాలి తరఫు న్యాయవాదికి సూచించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేశారు.
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్థలాల్లో మహిళలకు ప్రవేశం నిషేధానికి సంబంధించిన పిటిషన్లపై ఏప్రిల్ 7 నుంచి తుది విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందుకోసం తొమ్మిది మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో తప్పనిసరైన మత సంప్రదాయాలు, సమానత్వం, రాజ్యాంగ నైతికత వంటి కీలక అంశాలపై బెంచ్ విచారణ చేయనుంది.
ఒరిజినల్ పిటిషన్లతో పాటు తాజా పిటిషన్లను షెడ్యూల్ ప్రకారం విచారణ చేస్తామని, షెడ్యూల్ టైమ్ లైన్ కచ్చితంగా పాటిస్తామని కోర్ట్ ప్రకటించింది. 10-50 ఏండ్ల మధ్య వయసున్న బాలికలు, మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు 2018లో కీలక తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్ట్ తాజా విచారణ నిర్ణయంపై కేరళ న్యాయ శాఖ మంత్రి స్పందిస్తూ ప్రస్తుతం ఏర్పాటైన బెంచ్ గతంలో వెలువడిన తీర్పును సమీక్షిస్తుందని.. ఆ తర్వాత సుప్రీంకోర్ట్ మార్గ దర్శకాల ప్రకారం ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.