అది అమెరికా కుతంత్రం 1962 భారత్-చైనా యుద్ధానికి ఇప్పటివరకు చెప్పుకొంటున్నట్టుగా సరిహద్దు వివాదమో లేదా దౌత్యపరమైన వైఫల్యమో ప్రధాన కారణం కాదని అమెరికాలోని ఓ ప్రముఖ అకడమిక్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన పత్రం వెల్లడించింది. 1950 నుంచి 1960వ దశకం ప్రారంభం వరకు అమెరికా ఉద్దేశపూర్వకంగా పన్నిన ఒక వ్యూహమే ఈ పోరుకు ఆజ్యం పోసిందని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.
సీఐఏ బహిర్గతం చేసిన పలు రికార్డులు, ప్రధాని మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్)లోని దౌత్య పత్రాలు, ఫారిన్ రిలేషన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ (ఎఫ్ఆర్యూఎస్), కోల్డ్ వార్ ఇంటర్నేషనల్ హిస్టరీ ప్రాజెక్టు పత్రాల ఆధారంగా జరిగిన పరిశోధన పత్రం ‘అన్రావెలింగ్ ది జియోపొలిటికల్ డైమెన్షన్స్ ఆఫ్ ది 1962 చైనా-ఇండియన్ కాన్ఫ్లిక్ట్: హౌ ది యూఎస్ షేప్డ్ ది చైనా-ఇండియా స్ప్లిట్’ పేరిట ‘జర్నల్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ (విలీ)’ ఏప్రిల్ సంచికలో ప్రచురితమైంది. దీర్ఘకాలంగా ప్రచారంలో ఉన్న వాదనలను ఈ అధ్యయనం సవాల్ చేస్తున్నది.
భారత్-చైనా మధ్య సంబంధాలను చెడగొట్టడం, ఉద్రిక్తతలను తీవ్రతరం చేయడం, ఇరుదేశాల మధ్య రాజకీయ, దౌత్యపరమైన చర్చలు జరగకుండా అడ్డుకోవడమే నాడు అమెరికా లక్ష్యమని జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌కు చెందిన రచయిత డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ‘బిజినెస్ లైన్’తో చెప్పడం గమనార్హం. ఈ అధ్యయనం ప్రకారం.. 1962లో భారత్‌పై చైనా దాడి చేయడానికి ప్రధాన కారణం టిబెట్. టిబెట్ సమస్యను రాజకీయ, భావోద్వేగ అంశంగా భావించేలా భారత విదేశాంగ విధానాన్ని అమెరికా ప్రభావితం చేసిందని, ఆసియా లో ఐక్యతను దెబ్బతీసిందని, తద్వారా కోల్డ్ వార్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాం తాన్ని నడిపించిందని, ఆ తర్వాతే పోరు మొదలైందని ఈ అధ్యయనం చెప్తున్నది.
1950ల ప్రారంభంలో ఆసియాలో భారత్ తన వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని అమెరికా ఆశలు పెట్టుకుంది. కానీ, నెహ్రూ ప్రభుత్వం అలీన విధానాన్ని ఎంచుకున్నది. దీంతో అమెరికా పరోక్షంగా ప్రభావితం చేసే మార్గాన్ని అన్వేషించిందని ఈ అధ్యయనం వాదిస్తున్నది. ఇందులో టిబెట్ సమస్య కేంద్ర బిందువుగా మారింది. 1956లో టిబెట్ తిరుగుబాటు అమెరికాకు తాను ఎదురుచూస్తున్న అవకాశాన్ని ఇచ్చిందని అధ్యయనం చెప్తున్నది. ఈ తిరుగుబాటును అమెరికా వ్యూహాత్మక అవకాశంగా భావించింది. ఇదే అదునుగా సీఐఏ కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా టిబెట్‌లోని తిరుగుబాటు గ్రూపులకు మద్దతు ఇవ్వడం ప్రారంభించినట్టు పరిశోధక పత్రాల ద్వారా తెలుస్తున్నది. 1959లో దలైలామా భారత్‌కు వచ్చిన తర్వాత ఈ కోవర్ట్ ఆపరేషన్ వేగం పుంజుకున్నది. నిధులు, సామగ్రిని సమకూర్చడం, గూఢచారి ఆపరేషన్లు చేపట్టడం తదితర చర్యల ద్వారా టిబెట్‌లోని గెరిల్లాలకు అమెరికా సాయం చేసింది. అమెరికాకు నాడు సైనిక మిత్రదేశంగా ఉన్న పాకిస్థాన్ నుంచి వీటిని చేరవేశారు. పాక్ సహకారంతో హిమాలయ ప్రాంతంలో అమెరికా ప్రభావం పెరుగుతున్నదని; చైనాకు వ్యతిరేకంగా భారత్-అమెరికా-పాక్ కూటమి ఏర్పడుతున్నట్టుగా డ్రాగన్ భావించిందని ఈ అధ్యయనం తెలిపింది.
అమెరికా చేసిన ఈ కోవర్ట్ ఆపరేషన్ టిబెట్ రాజకీయ ప్రయోజనాల కోసం కానే కాదని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. భారత్-చైనా విభేదాలను మరింతగా పెంచడం, ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరగకుండా నివారించడమే ఈ ఆపరేషన్ ఉద్దేశమని పరిశోధన పత్రం ద్వారా తెలుస్తున్నది. భారత్-చైనా సరిహద్దు సమస్య చర్చల ద్వారా పరిష్కారమయ్యే అవకాశం ఉందని సీఐఏ గుర్తించింది. అయినప్పటికీ, ఉద్రిక్తతలను పెంచే విధంగా విస్తృతంగా ప్రజా చర్చను లేవదీసి, తద్వారా దౌత్యపరమైన చర్చలకు ఆస్కారం లేకుండా భారత్‌కు పరిస్థితులను కల్పించినట్టు అధ్యయన పత్రం సూచిస్తున్నది.
అమెరికా మాజీ రాయబారి
జాన్ కెనెత్ గాల్బ్రేత్ గతంలో చెప్పిన మాటలు కూడా సీఐఏ పాత్ర ఉందన్న వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ద్వారా భారత్‌లో మీడియా కథనాలను సీఐఏ ప్రభావితం చేసిందని ఆయన చెప్పారు. రాజకీయ పక్షాలకు డబ్బులు పంచినట్టు, ప్రజల్లో చర్చలను ప్రభావితం చేసినట్టు పేర్కొన్నారు. ఈ చర్యను ఆలోచన ప్రేరేపణతో జరిగే యుద్ధానికి ప్రారంభ దశగా డాక్టర్ లక్ష్మణ్ అభివర్ణించారు.
1960 దశకం ప్రారంభంలో భారత్ పరిస్థితి మరింత దుర్బలంగా మారింది. సౌత్ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్ (SEATO), సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (CENTO) కూటముల ద్వారా పాక్‌కు అమెరికా సైనిక సహాయం చేయడం ఉపఖండంలో ఆయుధ పోటీకి ఆజ్యం పోసింది. అదే సమయంలో భారత ఆర్థికరంగం పాశ్చాత్య రుణాలపై ఆధారపడి ఉండటం భారత విదేశాంగ విధానాన్ని కట్టడి చేసింది. పాక్‌కు ఒకవైపు ఆయుధాలు అందిస్తూనే, మరోవైపు భారత్‌కు ఆర్థిక మద్దతు ఇవ్వడం అమెరికా ద్వంద్వ విధానానికి నిదర్శనం.
1962లో యుద్ధం మొదలైనప్పుడు టిబెట్‌లో దశాబ్దాలుగా సీఐఏ చేస్తున్న కోవర్ట్ ఆపరేషన్ల కొనసాగింపుగానే భారత్ ఇలాంటి చర్యలకు పూనుకుందని చైనా భావించినట్టుగా ఈ అధ్యయనం పేర్కొన్నది. భారత్ పాశ్చాత్య కూటముల వైపు మొగ్గుచూపుతున్నట్టుగా చైనా నిర్ధారణకు వచ్చిందని ఈ పరిశోధన పత్రం తెలిపింది. యుద్ధ సమయంలో సైనిక, దౌత్య సహాయం చేయడానికి అమెరికా ముందుకొచ్చి, భారత్‌ను పాశ్చాత్య శిబిరానికి మరింత దగ్గర చేసింది.
అమెరికా జోక్యం చేసుకున్నట్టుగా చైనా భావించేలా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని అగ్రరాజ్యం ఆదేశించినట్టు జాన్ ఎఫ్ కెన్నడీ (జేఎఫ్‌కే) ప్రెసిడెన్షియల్ లైబ్రరీలోని ఒక పరిశోధన పత్రం ద్వారా తెలుస్తున్నది. అయితే, ఈ కోవర్ట్ ఆపరేషన్ వాస్తవానికి ఆశించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపింది. భారత్-చైనా ఘర్షణకు దారితీయడమే కాదు, చైనా-సోవియట్ యూనియన్ మధ్య విభేదాలను ఇది మరింత పెంచింది. చివరికి అలీన విధానానికి విరుద్ధంగా అమెరికా సైనిక సహాయం కోరే స్థితిలోకి నాటి ప్రధాని నెహ్రూను 1962 యుద్ధం నెట్టివేసింది. భారత ప్రధాని అభ్యర్థనతో అమెరికా ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. వాషింగ్టన్ లోపల్లోపల కోరుకున్నది ఇదేనని పరిశోధన పత్రం పేర్కొన్నది.
-(‘బిజినెస్ లైన్’ సౌజన్యంతో..)
-దలీప్ సింగ్