Excessive Salt Symptoms | మనం నిత్యం అనేక రకాల వంటల్లో ఉప్పును వేస్తుంటాం. ఉప్పు వేయకుండా ఏ వంటకమూ పూర్తి కాదు. ప్రతి వంటకంలోనూ ఉప్పు కచ్చితంగా ఉండాల్సిందే. ఉప్పు వల్ల కూరలకు రుచి వస్తుంది. అయితే ప్రపంప ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్రజలు రోజూ కావల్సిన దాని కన్నా అధిక మొత్తంలో ఉప్పును తింటున్నారని తేలింది. రోజుకు మనకు 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. కానీ చాలా మంది 8 నుంచి 10 గ్రాముల వరకు ఉప్పును తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఉప్పును అధికంగా తినడం వల్ల అనేక దుష్సరిణామాలు సంభవిస్తాయి. ఉప్పు అనేక వ్యాధులకు కారణం అవుతుంది. అయితే చాలా మందికి తాము ఉప్పును అధికంగా తింటున్నామని తెలియదు. కానీ ఉప్పును అధికంగా తింటుంటే శరీరం మనకు పలు లక్షణాలు, సంకేతాలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా మన శరీరంలో ఉప్పు అధికంగా ఉందని సులభంగా గుర్తించవచ్చు. దీంతో ఉప్పును తక్కువగా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
శరీరంలో ఉప్పు అధికంగా ఉంటే సోడియం స్థాయిలు పెరుగుతాయి. ఈ క్రమంలో ఆ సోడియంను బయటకు పంపించేందుకు కిడ్నీలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. సోడియంను బయటకు పంపించాలంటే నీరు అధికంగా అవసరం అవుతుంది. అందువల్ల శరీరం మనకు ఎక్కువగా నీళ్లను తాగాలని దాహం రూపంలో తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే సోడియం లెవల్స్ అధికంగా ఉన్నవారికి తరచూ దాహం అవుతుంది. ఎన్ని నీళ్లను తాగినా కూడా దాహం ఇంకా తీరదు. షుగర్ లేని వారికి తరచూ ఇలా దాహంగా ఉంటే వారు నీళ్లను తక్కువగా తాగుతున్నారని లేదా ఉప్పును ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఉప్పును గనక అధికంగా తింటుంటే దాన్ని తినడం తగ్గించాలి. దీంతో అతి దాహం సమస్య సులభంగా తగ్గుతుంది. ఇక ఉప్పును అధికంగా తినేవారి శరీరంలో సోడియం అధికంగా ఉంటుంది కనుక శరీరం తరచూ వాపులకు గురవుతుంది. ఈ లక్షణం కనిపిస్తున్నా కూడా ఉప్పును అధికంగా తింటున్నారేమో చెక్ చేసుకోవాలి.
ఉప్పును అధికంగా తింటే శరీరంలోని ద్రవాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఫలితంగా తలనొప్పి వస్తుంది. తరచూ తలనొప్పి వస్తుంటే మీరు ఉప్పును అధికంగా తింటున్నారేమో తెలుసుకోవాలి. దీని వల్ల తలనొప్పి నుంచి కూడా సులభంగా బయట పడవచ్చు. ఇక శరీరంలో ఉప్పు అధికంగా ఉంటే సోడియం స్థాయిలు పెరిగి దాని ప్రభావం ఎముకలపై పడుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఎముకలు తరచూ నొప్పిగా ఉంటాయి. చిన్న దెబ్బ తగిలినా కూడా విపరీతమైన నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి ఒక పట్టాన తగ్గదు. అలాగే ఉప్పును అధికంగా తింటే శరీరంలోని ద్రవాలు అధికంగా బయటకు వెళ్లే క్రమంతో తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట ఇలా ఎక్కువగా జరుగుతుంది. మీకు షుగర్ లేకపోయినా తరచూ మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం వస్తుందంటే మీరు ఉప్పును అధికంగా తింటున్నారేమో చెక్ చేసుకోండి.
ఉప్పును అధికంగా తింటే శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్త నాళాల గోడలపై ఒత్తిడి పడుతుంది. దీంతో రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. మీకు బీపీ ఉన్నట్లుండి సడెన్గా పెరిగి అది అలాగే కొనసాగుతూ ఉంటే మీరు ఉప్పును ఎక్కువగా తింటున్నారేమో పరిశీలించండి. ఉప్పును తక్కువగా తీసుకోండి. లేదా కొన్ని రోజులు మానేయండి. దీంతో బీపీని ఆరంభంలోనే తగ్గించుకోవచ్చు. దీని వల్ల జీవితాంతం మందులను వాడాల్సిన అవసరం ఉండదు. ఇలా పలు లక్షణాలను గమనించడం ద్వారా మీరు ఉప్పును అధికంగా తింటున్నారో లేదో సులభంగా తెలిసిపోతుంది. దీని వల్ల తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది.