పెరుగుతున్న వ్యతిరేకత మనది ప్రజాస్వామ్య దేశం. 140 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఎన్నికకూ ఒక ప్రత్యేక నేపథ్యం ఉంటుంది. ప్రతి ఎన్నికలోనూ ప్రచారాంశాలూ వేర్వేరుగా ఉంటాయి. ప్రతి ఎన్నికపై వేర్వేరు అంశాల ప్రభావం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలనే చూసుకుంటే జాతీయ ఆసక్తులు, దేశ ప్రయోజనాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చూస్తే రాష్ట్ర ప్రాధాన్యాలు, స్థానికత, రాష్ట్ర ప్రయోజనాలు, ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతీయ పార్టీలు, రాష్ర్టాన్ని నడిపించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశాలు ముఖ్యంగా ప్రభావం చూపుతాయి. ఇక ఉప ఎన్నిక గురించి మాట్లాడుకుంటే, అది ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైనది. ఆ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్న అంశంతో పాటు అభ్యర్థుల బలాబలాలు, స్థానిక సమస్యలు ఇందులో ప్రాధాన్యాంశాలుగా మారుతాయి. దీని ప్రభావం ఆ తర్వాతి ఎన్నికలపై పెద్దగా ఉండదు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత ఇసుమంతైనా తగ్గలేదు సరికదా నానాటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నది.
సువిశాల భారతదేశంలో ఒక ఎన్నికతో మరో ఎన్నికకు సంబంధమే ఉండదు. ఓ ఎన్నికలో ఒక పార్టీకి అనుకూలంగా వచ్చిన ఫలితం తర్వాతి ఎన్నికలో తారుమారవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణవాదాన్ని నిరూపించేందుకు పదే పదే రాజీనామా అస్ర్తాన్ని సంధించేవారు. 2001 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వలసవాదుల పాలన నడిచినప్పటికీ, ప్రతి ఎన్నిక లేదా ఉప ఎన్నికలోనూ కేసీఆర్ విజయదుందుభి మోగించారు. తాను గెలవడమే కాదు, తన సహచరులనూ కేసీఆర్ గెలిపించుకున్నారు. ప్రాంతీయవాదం, తెలంగాణవాదం, కేసీఆర్ నాయకత్వం, ఆ ఎన్నిక లేదా ఉప ఎన్నిక స్వరాష్ట్ర సాధన కోసమే జరుగుతున్నదనే బలమైన కారణం నాటి విజయానికి ప్రధానంగా దోహదపడ్డాయి. ఇక 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా మోదీ గాలి వీచినప్పటికీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన కొంచెం కూడా ప్రభావం చూపలేకపోయారు. అందుకు ప్రధాన కారణం సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యాలు వేర్వేరు కావడమే. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 100కు పైగా స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకోలేదు. అదే విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచి, రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని విర్రవీగిన ఆ పార్టీ తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ డిపాజిట్ దక్కించుకోలేదు.
ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో ఎన్డీయే అధికారంలో ఉన్నప్పటికీ మహా వికాస్ అఘాడీ అత్యధికంగా 30 సీట్లలో గెలుపొందింది. మహాయుతి కూటమి 17 స్థానాల్లోనే గెలిచింది. కానీ, ఆ తర్వాత స్థానిక అంశాల ఆధారంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అనూహ్యంగా విజయం సాధించింది. అదే విధంగా హర్యానాలోనూ మొత్తం 10 స్థానాల్లో ఇండియా కూటమి 5 స్థానాల్లో గెలవగా, ఎన్డీయే కూటమి 5 స్థానాల్లో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని ఇండియా కూటమి భావించగా, వ్యతిరేకత ఉందన్న ప్రచారాన్ని తిప్పికొడుతూ, సర్వేలను తోసిరాజని అనూహ్యంగా ఎన్డీయే గెలిచింది. అలాగే 2019లో పశ్చిమబెంగాల్లో సగం వరకు ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. కానీ, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మమత నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే, రాష్ట్ర ప్రజలు మమత నాయకత్వాన్ని కోరుకోగా, ఆమె పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆమెను కాదనుకున్నారు. ఇలా దేశ చరిత్రను చూసుకుంటే ఒక ఎన్నిక ప్రభావం మరో ఎన్నికపై ఉండదని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి.
ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో గెలిచామని కాంగ్రెస్ సంకలు గుద్దుకుంటున్నది. అయితే, ఆ గెలుపు వల్ల రాష్ర్టానికి కాదు కదా, కనీసం కాంగ్రెస్ పార్టీకైనా ఒరిగిందేమీ లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం దాటి ఆ ప్రభావం లేనే లేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత మరింతగా పెరుగుతూనే ఉన్నది. కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన ఆటోవాలాల జీవితాలు మారిపోయాయా? రైతుల కష్టాలు తీరిపోయాయా? పెన్షనర్లకు బకాయిలు అందాయా? మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వచ్చాయా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? ఉద్యోగులకు డీఏలు అందాయా? పత్తి కొనుగోళ్లు జరిగాయా? వడ్ల కొనుగోళ్ల బాధ తప్పిందా? సన్నాలకు బోనస్ అందిందా? రైతుబంధు చేతికొచ్చిందా? విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా? ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలైందా? ఇలా చెప్పుకుంటూపోతే సమస్యలు పెరిగాయే తప్ప, తరగలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో కాంగ్రెస్ పాలకుల పట్ల అసంతృప్తి, రేవంత్ సర్కార్‌పై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతునే ఉన్నది. ఈ వ్యతిరేకత దృష్ట్యా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పక తప్పదు. ‘అన్యాయాన్ని ఎదిరించడం నా జన్మ హక్కు’ అన్న కాళోజీ బాటలో, కేసీఆర్ మార్గనిర్దేశంలో కాంగ్రెస్ విధ్వంసక పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరు సలుపుతున్నారు. ఆయన బాటలో పయనిస్తూ, తెలంగాణ విముక్తి కోసం తెలంగాణవాదులందరూ మరోసారి పోరాడాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-డాక్టర్ దూదిమెట్ల
బాలరాజు యాదవ్