చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా దేశంలోని మహిళలను ఊరిస్తూ వచ్చింది. 128వ రాజ్యాంగ సవరణ ద్వారా శాసనసభ, లోక్‌సభలలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చరిత్రాత్మకమైన మహిళా బిల్లు నారీశక్తి వందన్ పేరుతో పార్లమెంటులో అత్యధిక ఓట్లతో ఆమోదం పొందడం గొప్ప పరిణామం.
Women’s Reservation bill | మహిళా బిల్లుపై పార్లమెంటులో సుదీర్ఘంగా ఎనిమిది గంటలపాటూ చర్చ జరిగింది. ఈ చర్చలో అన్ని రాజకీయపార్టీలకు చెందిన అరవై మంది సభ్యులు తమ అభిప్రాయాలను సభకు తెలియచేయడం గమనార్హం. అనంతరం జరిగిన ఓటింగ్ లో పాల్గొన్న 456 మంది సభ్యులలో 454 మంది బిల్లుకు అనుకూలంగా ఓటువేయడం విశేషం. కేవలం ఎం.ఐ.ఎంకు చెందిన ఇద్దరు సభ్యులు మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. తదనంతరం రాజ్యసభకు వెళ్లిన మహిళాబిల్లు అక్కడ సునాయాసంగా పెద్దల ఆమోదం పొందింది.
మహిళాబిల్లు కార్యరూపం దాల్చి దశాబ్దాల తమ కల సాకారం అవుతున్న సమయంలో హర్షాతిరేకం వ్యక్తం చేస్తుందనుకున్న మహిళాలోకం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం ఆశ్చర్యకరం. మహిళా బిల్లు కేంద్ర క్యాబినేట్ ఆమోదం పొందిన నాటి నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మహిళానేతలు, కార్యకర్తలు మహిళాబిల్లుపై హర్షం వ్యక్తం చేస్తూనే బిల్లు ఖ్యాతి తమ ఖాతాలోకి వేసుకునేందుకు పడరానిపాట్లు పడడం స్పష్టంగా కనిపించింది. విద్యావంతులు, ఉద్యోగస్తులు,గృహిణులు, వివిధ రంగాలకు చెందిన మహిళలు బిల్లు ఆచరణ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
గతంలో వలే ప్రస్తుత బిల్లూ మహిళలను మభ్యపెట్టేదేనని కొంతమంది అభిప్రాయపడుతుండగా మరికొంత మంది గృహిణులు మాత్రం వంటింటి ఓట్లు పొందే ఎత్తుగడగా ఈ బిల్లును అభివర్ణిస్తుండడం విశేషం. మూడు దశాబ్దాలుగా మహిళాబిల్లు విషయంలో దేశంలోని అన్ని ప్రధాన రాజకీయపార్టీలు అవలంబించిన అవకాశవాద రాజకీయ నేపథ్యం, ప్రస్తుత బిల్లు కార్యాచరణకు నిర్దేశించిన కాలపరిమితితో కూడిన నియమాలు, అధికారంలోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాలు బిల్లుపై నోరు మెదపకుండా, మరో ఎనిమిది నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో హడావిడిగా ప్రత్యేక సమావేశాలు ఏర్పరచి మహిళాబిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన వైనాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళలు ఈ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.
1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి చెందిన అప్పటి ప్రధాని దేవెగౌడ మొట్టమొదటి పర్యాయం మహిళాబిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో బిల్లు పార్లమెంటు ఆమోదం పొందక పోవడంతో 1998, 1999, 2002, 2003 సంవత్సరాలలో కూడా అప్పటి ప్రధాని వాజపేయి నాయకత్వంలో మహిళాబిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టబడి తిరస్కరణకు గురైంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం 2010లో మహిళా బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొంది లోకసభకు పంపడం జరిగింది. లోక్‌సభలో 2014 వరకు నాలుగు సంవత్సరాలు మహిళాబిల్లు అటకెక్కడం జరిగింది.
మహిళాబిల్లు పార్లమెంటులో మొట్టమొదటి పర్యాయం ప్రవేశపెట్టబడిన 1996 నుంచి నేటి వరకు గడచిన 27 సంవత్సరాలలో 17 సంవత్సరాలు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలో ఉండగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండింది. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రస్తుత ఎన్డీయే ప్రవేశపెట్టిన మహిళాబిల్లు ఆచరణపై మహిళలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు సమంజసమైనవే అని కచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా పార్లమెంటు ఆమోదం పొందిన ప్రస్తుత మహిళా బిల్లు జనగణన మరియు నియోజకవర్గాల పునర్విభజన తరువాత మాత్రమే ఆచరణలోకి వస్తుందని బిల్లులో పొందుపరచడంతోపాటు లోక్‌సభలో ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీని ప్రకారం 2027 తర్వాత జరిగే ఎన్నికల సమయంలోనే మహిళాబిల్లు ఆచరణలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామం ప్రామాణికంగా బిల్లు ఆచరణలోకి తెచ్చే విషయంలో బీజేపీ చిత్తశుద్దిని శంకించాల్సి వస్తున్నది.
రాజ్యసభలో పూర్తిస్థాయిలో మెజారిటీ లేకున్నా దశాబ్దాలుగా ఉన్న ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ వంటి అనేక సున్నితమైన సమస్యలపై ఎన్డీయే ప్రభుత్వం చట్టాలు చేయగలిగింది. ఆ సమయం లో ప్రధాని నరేంద్ర మోదీ సమర్థత గురించి పాలకవర్గాలు గొప్పలు చెప్పుకున్నాయి. అంతటి సమర్థుడైన మోదీ 2024 ఎన్నికల నుంచి కాకుండా 2027 తరువాత వచ్చే ఎన్నికల నుంచే మహిళా బిల్లు ఆచరణలోకి వచ్చేటట్టు ఎందుకు రూపొందించారో మేధావులకు సైతం అంతుచిక్కడం లేదు. ఏదిఏమైనా మహిళా బిల్లు ఆచరణలోకి వచ్చినప్పుడే మహిళలు ఆనందపడే అవకాశం ఉంటుంది.
( వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్,కాలమిస్ట్ హైదరాబాద్)
-కైలసాని శివప్రసాద్
94402 03999