డయాబెటిక్ ఫ్రెండ్లీ.. ఆర్గానిక్.. నేచురల్.. గ్లూటెన్-ఫ్రీ.. షుగర్ ఫ్రీ.. సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు ఇలాంటి లేబుల్స్‌తో ఎన్నోరకాల ప్రకటనలన్నీ.. పైపై మెరుగులేఆహార పదార్థాలు చూస్తుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధతో చాలామంది వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే, అవి ‘పేరుకు మాత్రమే ఆరోగ్యకరమైనవి’ అని వైద్య నిపుణులు అంటున్నారు. వీటిలో చాలా ఉత్పత్తులు ఆరోగ్యానికి ముప్పు కలిగించే పదార్థాలతో నిండి ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అది కేవలం మార్కెటింగ్ వ్యూహం మాత్రమేననీ, ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేవని చెబుతున్నారు.
పేగుల ఆరోగ్యానికి యోగర్ట్ చాలా మంచిది. రెగ్యులర్‌గా పెరుగు, యోగర్ట్ తీసుకుంటే.. కొలొరెక్టల్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందొచ్చని ఇటీవలి పరిశోధనలు కూడా కనుగొన్నాయి. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. నిపుణులు చెప్పేది ప్లెయిన్ యోగర్ట్ గురించి. మరి సూపర్ మార్కెట్లలో మాత్రం వివిధ ఫ్లేవర్లలో యోగర్ట్ అమ్ముతుంటారు. సాదాసీదా యోగర్ట్‌కు చక్కెరలు, కృత్రిమ రుచులను జోడించి.. ఫ్లేవర్డ్ యోగర్ట్‌ను తయారుచేస్తారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
పండ్ల రసాల విషయంలో చాలామంది చేసే సాధారణ తప్పు.. ప్యాక్ చేసిన పండ్ల రసాలను తీసుకోవడం. చాలా పానీయాలు నిజమైన పండ్లతోనే తయారైనట్లు ప్రకటనలు గుప్పిస్తుంటాయి. అయినా.. అవి ఆరోగ్యకరమైనవని కాదు. ఈ రసాల్లో ఫైబర్ ఏమాత్రం ఉండదు. అధిక మొత్తంలో చక్కెరలు, రసాయనాలు కలిపి ఉంటాయి. నిజంగా పండు రుచిని ఆస్వాదించాలంటే, దాని ప్రయోజనాలను పొందాలనుకుంటే.. ఈ ట్రెట్రా ప్యాక్స్‌ను వదిలివేసి నిజమైన పండ్లను తినండి. అప్పుడే, చక్కెర లేకుండా పూర్తిస్థాయి ఫైబర్‌ను పొందవచ్చు.
ఇవైతే గోరు చుట్టుపై రోకలిపోటు లాంటివే! అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మరింత ఇబ్బంది పెట్టేవే! నిజానికి డయాబెటిక్ ఫ్రెండ్లీ, షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అంటూ ప్రచారం చేసే చాలా ఉత్పత్తుల్లో నిజంగానే చెక్కర ఉండదు. కానీ, ఆరోగ్యానికి మరింత హాని కలిగించే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు, పేగులను చికాకు పెట్టే పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయులను, పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను గందరగోళానికి గురిచేస్తాయి.