హైదరాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ (Pre Matric Scholarship) పురోగతిలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉన్నది. లక్ష మందికి ఉపకార వేతనాలు (Scholarship) అందించాలని లక్ష్యం పెట్టుకొని ఇప్పటివరకు కేవలం రాష్ట్రం నుంచి 2600మంది అంటే 2.60శాతం మాత్రమే పేర్లు నమోదు చేయడం దీనికి నిదర్శనం. 2025-26 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రంలో లక్ష మంది ఈ స్కాలర్షిప్లు ఇవ్వాలనే లక్ష్యం విధించింది. గడువు తేదీ నవంబర్ 30లోగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిర్దేశిత లక్ష్యంలో 2.60శాతానికే పరిమితమైంది.
విద్య, ఎస్సీ అభివృద్ధి శాఖల మధ్య సమన్వయలోపమే ఇందుకు కారణమని తెలుస్తుండగా, స్కాలర్షిప్లపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నది. ఇప్పటివరకు జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 22.36శాతం నమోదైంది. ఇక 15 జిల్లాలో ఒక శాతమే పూర్తికాగా, మిగితా 16 జిల్లాలు ఆ ఒక్క శాతాన్ని కూడా పూర్తి చేయలేదు. ములుగు జిల్లా ఇప్పటివరకు మొదలే పెట్టలేదంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా అధికారులు తక్షణం దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది.