‘మాకు రైతులు, మత్స్యకారులే ముఖ్యం. రైతుల ప్రయోజనాల విషయంలో దేశం ఎన్నటికీ రాజీపడబోదు. దీనికోసం వ్యక్తిగతంగా నేను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసు. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ, భారతదేశ రైతులకు, మత్స్యకారులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి నిర్ణయం మా ప్రభుత్వం తీసుకోదు’ అని ఆగస్టు 7న ఢిల్లీలోని ఐసీఏఆర్ పూసా క్యాంపస్‌లో జరిగిన స్వామినాథన్ సదస్సులో ప్రధాని మోదీ ఎంతో గొప్పగా ప్రకటించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గించాలని భారతదేశంపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్న వేళ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు తలొగ్గేదే లేదన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసి 15 రోజులైనా గడవకముందే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19న పత్తిపై దిగుమతి సుంకాన్ని 11 శాతం నుంచి పూర్తిగా తగ్గించింది. దేశంలోని వస్త్ర పరిశ్రమ విదేశీ పత్తిని తక్కువ ధరకు దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పించింది. కేవలం అమెరికా టారిఫ్‌ల నుంచి భారత వస్త్ర పరిశ్రమను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, దేశీయంగా పత్తి మార్కెట్లోకి వచ్చే సెప్టెంబర్ 30 వరకే ఇది అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ సుంకాలు యథావిథిగా అమలవుతాయని, రైతులను ఇబ్బంది పడనీయబోమని చెప్పింది. ఇది చెప్పి 10 రోజులైనా గడవకముందే ఆగస్టు 28న మరో ప్రకటన చేస్తూ.. పత్తి దిగుమతిపై సుంకం ఎత్తివేత నిర్ణయం డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని పేర్కొన్నది.
గత రెండు మూడు రోజులుగా అన్ని దినపత్రికల్లో ‘పత్తి రైతు చిత్తు’ అంటూ, పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయంటూ మొదటి పేజీల్లో వార్తలు వస్తున్నాయి. కానీ, దీనికి కారణం ఏమిటనేది ఎందుకోగానీ ఎవరూ అంతగా హైలెట్ చేయడం లేదు. కేవలం మోదీ రైతు వ్యతిరేక నిర్ణయం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఈ రోజు రైతు తను పండించిన పత్తి పంటను అమ్ముకోలేకపోతున్నాడు. పత్తి కొనుగోలుకు కేంద్రం పెట్టిన కొత్త నిబంధనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. వాస్తవానికి ఈ ఏడాది వర్షాల వల్ల రాష్ట్రంలో పత్తి పంట బాగా దెబ్బతిన్నది. సహజంగానైతే ఇలా జరిగినప్పుడు దిగుబడి పడిపోయి, లభ్యత తగ్గిపోవడం వల్ల పత్తికి డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా పత్తి రేటు కూడా పెరగాలి. కానీ, క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. దేశీయంగా పత్తికి డిమాండ్ లేదు. ఎందుకని? ఎందుకంటే మోదీ ప్రభుత్వం అమెరికాకు, ట్రంప్‌కు తలొగ్గి పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేయడంతో దేశంలోని వస్త్ర పరిశ్రమలు అమెరికా, బ్రెజిల్ నుంచి పత్తిని తక్కువ ధరకు భారీగా కొంటున్నాయి. కాబట్టి ఇక్కడ పత్తికి డిమాండ్ తగ్గింది. మోదీ ప్రభుత్వ నిర్ణయం పత్తి రైతు పట్ల శాపంగా మారింది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి పత్తి కొనుగోళ్లకు ఎన్నో నిబంధనలు విధించింది. కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి రైతులు అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని నిబంధన విధించింది. అంతేకాకుండా ఒక ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొంటామని పరిమితి విధించింది. తేమతో ఉన్న పత్తి ధరలో భారీగా కోత విధిస్తున్నది. పత్తి కొనుగోళ్లను సాధ్యమైనంత తగ్గించుకోవడమే దీనివెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం అని రైతులు అర్థం చేసుకోవాలి. గతంలో కూడా రైతులు తమ పంటను మొత్తం సీసీఐకి అమ్మేవాళ్లు కాదు. స్థానికంగా ఉన్న జిన్నింగ్ మిల్లుకు, మార్కెట్ యార్డుకు వెళ్లి అక్కడ తమకు తగిన ధర లభిస్తున్నదనుకుంటే అమ్ముకొని వచ్చేవారు. సీసీఐ మాత్రమే కొనాలని ఎదురు చూసేవాళ్లు కాదు. మిల్లుల్లో ధరలు కూడా మద్దతు ధరకు అటూ ఇటుగా ఉండేవి. కానీ, ఇప్పుడు దేశీయంగా డిమాండ్ తగ్గిపోవడంతో మిల్లులు సీసీఐ స్థాయిలో రేటు పెట్టి కొనే పరిస్థితి లేదు.
ఫలితంగా రైతులు పంటను సీసీఐకి తప్ప అమ్ముకోలేని దుస్థితి. సీసీఐకి అమ్ముదామంటే సవాలక్ష ఆంక్షలు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని చెప్పి మోదీ ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది. పత్తి దిగుమతిపై సుంకం ఎత్తివేస్తున్నామని కేంద్రం ప్రకటించిన రెండు రోజుల్లోనే దేశీయంగా జిన్నింగ్ మిల్లుల్లో ప్రాసెస్ చేసిన పత్తికి డిమాండ్ తగ్గి ఆ పత్తి ధర క్వింటాకు రూ.1,100 తగ్గిపోయింది. అప్పటి నుంచి ధర తగ్గుతూనే వస్తున్నది. ఫలితంగా మిల్లులు కూడా రైతులకు ఎక్కువ రేటు చెల్లించడం లేదు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రతీ రైతు క్వింటాలుకు కనీసం రూ.2 వేలు నష్టపోతున్నాడని ఓ అంచనా. ఈ నేపథ్యంలో కేంద్రం తన రైతు వ్యతిరేక నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పత్తి రైతులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలి. మద్దతు ధర కంటే రైతులు ఏ మేర నష్టపోతున్నారో అంత మేర బోనస్ ప్రకటించే ఆలోచన చేయాలి. దీనికోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి. గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా చర్యలు తీసుకున్నాయి.
(వ్యాసకర్త: రెడ్కో మాజీ చైర్మన్)
-వై.సతీష్ రెడ్డి
96414 66666