ఆర్థికంగా కష్టాల్లో ఉన్న నిర్భాగ్యులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పథకం లక్ష్యం నీరుగారుతున్నది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు ఆలస్యమవుతుండటంతో పేదలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. వైద్య ఖర్చుల కోసం తెచ్చిన అప్పుల భారం మోయలేక ఆర్థికంగా చితికిపోతున్నారు.
అత్యవసర సమయాల్లో చాలామంది పేదలు చేతుల్లో చిల్విగవ్వ లేకపోయినా, అప్పోసప్పో చేసి ప్రైవేటు దవాఖానల్లో వైద్యం చేయించుకుంటున్నారు. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ, నెలలు గడుస్తున్నా సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసాయం మంజూరు కావడం లేదు. చెక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా వేల మంది నిరుపేదలు వెయ్యికండ్లతో ఎదురుచూస్తున్నారు. నాకు తెలిసిన ఆత్మీయుడొకరు గతంలో అనారోగ్యానికి గురై, అప్పు చేసి వైద్యం చేయించుకున్నారు. ఎనిమిది నెలల కిందట ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే, ఇప్పటికీ ఆ దరఖాస్తు పరిశీలనలోనే ఉన్నట్టు ఆన్లైన్లో చూపిస్తున్నది. ఇది ఆయన ఒక్కరి పరిస్థితే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పేదలు ఇలాంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ను నమ్ముకొని అప్పులు చేసి వైద్యం చేయించుకున్న అనేక కుటుంబాలు చెక్కుల కోసం దీనంగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు మానవతా దృక్పథంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరును వేగవంతం చేయాలి. వెంటనే దరఖాస్తులను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించుకొని, చెక్కులను మంజూరు చేయాలి. అంతేకాదు, అధికార, విపక్ష ప్రజాప్రతినిధి అనే పక్షపాతం చూపకుండా అందరు సిఫారసు చేసిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలి. దాంతోపాటు వైద్యానికయ్యే మొత్తాన్ని మంజూరు చేసి నిరుపేద కుటుంబాలకు భరోసా ఇవ్వాలి. అప్పుడే ఈ పథకం నిజమైన లక్ష్యం నెరవేరుతుంది.
-గుండమల్ల సతీష్ కుమార్
94931 55522