ఒక పుష్కర కాలం పాటు ఆంధ్రుల పాలన చూసిన తెలంగాణ ప్రజలకు సత్యం బోధపడింది.ఉమ్మడి రాష్ట్రంలో తమకు ఏ విధమైన న్యాయం జరగదని స్పష్టంగా అర్థమైంది. ఇక ప్రజలే ఎవరికి తోచిన విధంగా వారు నిరసనలు మొదలుపెట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వర్తక సంఘాలు, నిరుద్యోగులు- సమాజంలోని అన్ని రంగాల ప్రజలు తమ తమ సంఘాలు ఏర్పరచుకొని ఊరేగింపులు, నినాదాలు, నిరాహార దీక్షలు- అన్ని రకాలుగా తమ హక్కుల గురించి అడగటం మొదలుపెట్టారు. ఈ వివరాలన్నీ రాయాలంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది.
తెలంగాణలో అప్పటికే అన్ని వసతులతో, ఉద్యోగాలతో ప్రభుత్వ అండతో విర్రవీగుతున్న ఆంధ్ర ప్రజలూ తమ నాయకుల లాగానే ప్రవర్తించడం మొదలుపెట్టారు. 1968 జూన్ నుంచి తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇవి ఫలిస్తాయేమోనని ఇక్కడున్న ఆంధ్రులకూ అనిపించి దాడులు మొదలుపెట్టారు. తెలంగాణ వారి నిరసనలకు చిలవలు, పలవలు చేర్చి ఆంధ్ర పత్రికలు జరగని సంఘటనలను సృష్టించి వార్తలు రాయడమే దీనికి కారణం! 1969 జనవరి 30న శ్రీశైలం దగ్గర ఈగలపెంటలో నివసిస్తున్న తెలంగాణ ఉద్యోగులు, వర్కర్ల మీద ఆంధ్రులు దాడి చేశారు. ఈ రాక్షస చర్యలు జనవరి 31 దాకా సాగాయి. నల్లగొండలో రంగాచారి అనే ఉద్యోగిపై అతని ఆంధ్ర సహచర ఉద్యోగులే పెట్రోల్ పోసి తగులబెట్టి సజీవ దహనం చేశారు. చనిపోయింది తెలంగాణవాసి అయితే, అతనిది ఆంధ్ర అని, తెలంగాణ ఉద్యమకారులు ఆ పని చేశారని ఆంధ్ర పత్రికలు విషం చిమ్మాయి. మార్చి 3న తెలంగాణవాసులు చేసిన బంద్ సంపూర్ణంగా జరిగింది. కానీ, ఆంధ్ర పత్రికలు ‘బంద్ పాక్షికం’ అంటూ అబద్ధాలు రాశాయి.
1969 మార్చిలో ఒక రాజకీయ ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది. వారి నిరసనలూ కొనసాగాయి. ఆంధ్రవారి ఆగడాలూ కొనసాగాయి. మార్చి 28న వరంగల్ ఆర్ఈసీ కాలేజీలో 70 మంది తెలంగాణ విద్యార్థులపై 500 మంది ఆంధ్ర విద్యార్థులు ఇనుప రాడ్లతో దాడిచేశారు. అయితే, ఆంధ్ర నాయకుల ఒత్తిడితో పోలీసులు 62 మంది తెలంగాణ విద్యార్థులనే అరెస్ట్ చేశారు. వారు చాలా రోజులు జైల్లోనే ఉన్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అఖిలపక్షం ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్ర నాయకులతో సమావేశం జరిపి 8 సూత్రాలను ప్రకటించారు. కానీ, అవి అమలు కాలేదు, వాటి వల్ల ఏమీ జరగలేదు.
ఆ సమయంలో తెలంగాణలో నిర్వహించిన ఒక ముఖ్య సమావేశంలో 1956 నుంచి 1969 దాకా తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను గ్రంథస్థం చేశారు. అప్పటిదాకా మాటలు, విన్నపాలు, సూచనలు ఇవ్వటమే కానీ, నిర్దుష్టంగా, లెక్కలతో సహా తెలంగాణలో వివిధ రంగాలకు జరిగిన అన్యాయం ఎక్కడా లిఖించబడలేదు. సర్దార్ పటేల్ కాలేజీ, సికింద్రాబాద్‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆనందరావు తోట అప్పటిదాకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాదన కోసం గట్టిగా నిలబడ్డ మర్రి చెన్నారెడ్డికి ఉద్యమంలో సహచరుడిగా, సలహాదారుగా ఉన్నాడు. జరిగిన అన్యాయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలచి 1969 మే 20న సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణ మీద నిబద్ధతతో వివిధ రంగాల్లో జరిగిన అక్రమాలు, అన్యాయాల గురించి ఓయూ వైస్ ఛాన్స్లర్ రావాడ సత్యనారాయణ అధ్యక్షతన ఒక సెమినార్ నిర్వహించారు. వ్యవసాయం, నదీ జలాలు, ఉద్యోగాలు, విద్యార్థుల సమస్యలు, కార్మికులు, వివిధ రంగాల్లోని పనివారు, వివిధ రాజకీయ పార్టీల తీరు – అన్ని రకాల సమస్యల మీద పేపర్లు చదివారు ఆ ఉపాధ్యాయులు. ఆ సమావేశం ఏర్పరచి, కన్వీనర్‌గా వ్యవహరించిన ఆనందరావు తోట రాజకీయ పార్టీలు, వారి విధానాలు, తెలంగాణ మీద వారి అభిప్రాయాలు తదితర అన్ని అంశాలపై పత్రాలు సమర్పించారు. తర్వాత పక్కా లెక్కలతో 1956-1969 మధ్య తెలంగాణకు వివిధ రంగాల్లో జరిగిన అన్యాయాలు, మిగులు నిధుల దోపిడీ గురించిన ఆ సెమినార్ పేపర్లను ఒక పుస్తకంగా “తెలంగాణ- యాన్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్” అన్న శీర్షికన ప్రచురణ చేసి, ఇందిరాగాంధీ దగ్గర సమయం తీసుకుని ఢిల్లీ వెళ్లి ఆ గ్రంథాన్ని వారికి అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన నష్టాలు తెలిపిన మొట్టమొదటి గ్రంథం అది.
అపాయింట్‌మెంట్‌కి స్పందించి 45 నిమిషాల సమయం ఇచ్చారు ఇందిరాగాంధీ. ఆమె ఆఫీసు గదిలోకి వెళ్లిన ఆనందరావు తోటని చూసి ఆశ్చర్యచకితురాలైంది ఇందిర. ఎందుకంటే, కేవలం 32 సంవత్సరాల వయసుండి, బక్కగా, పొడుగ్గా ఉన్న యువకుడు ధీమాగా, జంకు గొంకు లేకుండా నడిచి రావడం ఆవిడకి ఆశ్చర్యం ఎందుకు కలిగించిందంటే.. అప్పటి దాకా ఆంధ్ర నాయకులందరూ తెలంగాణ సామాన్య జనాలకు ఏ భాషా సరిగ్గా రాదని, తెలివి లేదని, లోకం తెలియదని, రాష్ట్రం ఇచ్చినా వారు స్వపరిపాలన చేసుకోలేరనే మాటలతో ఆవిడ చెవులను నింపారు.
పుస్తకం, వివిధ రంగాల గురించి, తెలంగా ణ గురించి ఆనందరావు ఒక 15 నిమిషాలు మాట్లాడాక.. అతన్ని ఆగమని, ‘ఇంతకీ మీకేం కావాలి? ప్రత్యేక రాష్ట్రం తప్ప ఏదైనా సరే అడగండి’ అన్నారు నాటి ప్రధాని. అన్యాయం గురించి ఓపికగా విన్న ఆమె అలా అనగానే ఠక్కున లేచి నిలబడ్డ ఆనందరావు.. ‘అయితే ఇంక నేను చెప్పాల్సిందేమీ లేదు’ అని బయట కు నడవబోయాడు. ఆ ఆవేశం చూసిన ఆమె అతన్ని ఆపి, ‘మీరు ఈ వివరాల గురించి మన రక్షణ మంత్రి కృష్ణమీనన్‌తో చర్చించండి. సాధ్యాసాధ్యాలు వారు చెప్తారు’ అని అన్నారు. అయితే, ఆ సమావేశంలో కూడా వారు ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాదని తేల్చారు. అప్పుడు తెలంగాణ వారికి అర్థంకాని కారణం ఏమిటంటే, నిజాం రాజ్యానికి ప్రత్యేక దేశంగా ఉండటానికి యూఎన్వో అనుమతి 1978 దాకా ఉండింది. ప్రత్యేక రాష్ట్రమిస్తే, దేశంగా ఏర్పడతామని ఎక్కడ అంటారోనని భారతదేశ కేంద్రప్రభుత్వం భయపడింది. నిజాం రాజ్యం మీద సైనిక చర్య అక్రమమన్న అంశం అప్పటికీ యూఎన్ భద్రతా మండలిలో పదేపదే చర్చకు వచ్చేది. ఆ భయమే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఉండింది!
ఈ వైరుధ్యాలను సరిచేయాలనే ఉద్దేశంతో నిజానిజాలు తెలుసుకోవడానికి మొదట కుమార్ లలిత్ (ప్రత్యేక అధికారి) కమిటీని, ఆ తర్వాత ఒక ఉన్నత సంఘాన్ని వశిష్ట భార్గవ్ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి) అధ్యక్షతన వేసింది ప్రధాని. ఈ రెండు రిపోర్టుల్లో తెలంగాణ నిధులు ఆంధ్రకు మళ్లించారన్నది చాలా స్పష్టంగా ఉంది. అది కూడా తక్కువగా చూపారని తెలంగాణ నాయకులు పక్కా లెక్కలతో నిరూపించారు. ఆ లెక్కలు చూస్తే అర్థమవుతుంది.. ఎవరి సొమ్ము ఎవరు మింగారో!
కుమార్ లలిత్ రిపోర్టు నుంచి తీసుకున్న ఈ లెక్కలు కూడా సరైనవి కావని, ఈ నిధుల కంటే చాలా ఎక్కువ ఆంధ్రకు తరలించారని తెలంగాణ శాసనసభ్యులు పక్కా లెక్కలతో అప్పటి ప్రధానమంత్రికి చెప్పినా లాభం లేకపోయింది. వారు అసెంబ్లీలో సమర్పించిన కాగితాలను వలస పాలకులు రికార్డుల్లోంచి తొలగించారు.

-కనకదుర్గ దంటు
89772 43484