రైతుభరోసా రాదు. రుణమాఫీ కాదు. యూరియా దొరకదు. గోనె సంచులకూ కొరత. ఇలా రైతన్నలను అడుగడుగునా అరిగోస పెడుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు. ఏ సాయం అందకపోయినా, సొంతంగా పెట్టుబడి సమకూర్చుకొని, ఆరుగాలం కష్టపడి పంట పండించి అమ్ముదామని మార్కెట్కు పోతే కొనే నాథుడే దొరకడు. దీని ఫలితంగా అన్నదాతలు, మరీ ముఖ్యంగా పత్తి రైతులు ఆగమాగం అయిపోతున్నారు. మద్దతు ధర అస్థిరంగా ఉండటం, ప్రకటించిన ధర కూడా ఇవ్వకపోవడం రైతులపాలిట శాపంగా మారుతున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అటు కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి, వెరసి చెంపదెబ్బ గోడదెబ్బ అన్నట్టుగా తయారైంది పత్తి రైతు పరిస్థితి. పత్తి కొనుగోలు విషయంలో రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అడుగడుగునా కొర్రీలు వేస్తున్నది. నిరుడు మద్దతు ధర క్వింటాలుకు రూ.7,521 కాగా రైతుకు దక్కింది రూ.5,500 మాత్రమే. అంటే రూ.2,000 కోత కింద పోయింది.
ఈ ఏడాది మద్దతు ధర రూ.8,100కు పెంచినట్టు చెప్తున్నప్పటికీ రైతు చేతికి వచ్చేది రూ.6,000 మాత్రమే. సీసీఐ స్వయంగా మద్దతు ధర పూర్తిగా చెల్లించనప్పుడు ప్రైవేటు వ్యాపారి మా త్రం ఎలా చెల్లిస్తాడని అనుకుంటాము. గతంలో పత్తి కొనుగోళ్లలో జరిగిన అవకతవకల నివారణకు సీసీఐ ప్రవేశపెట్టిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లులు తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు ఏర్పడ్డాయి. టెండర్ల ప్రక్రియకు బ్రేకులు పడి పత్తి రైతు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో విలవిలలాడుతున్న పత్తి రైతుకు యాప్ రూపంలో మరో గండం వచ్చిపడింది. కపాస్ కిసాన్ యాప్ ద్వారానే కొనుగోళ్లు జరుపుతామని సీసీఐ షరతు పెట్టింది. చాలామంది రైతుల వద్ద ఇప్పటికీ స్మార్ట్ ఫోన్లు లేవు. పైగా రాష్ట్రమంతటా, ముఖ్యంగా పత్తిరైతులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో సరైన మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేదు. దీంతో రిజిస్ట్రేషన్ నుంచి అమ్మకం దాకా సమస్యలు వెన్నాడాయి. యాప్ కనెక్ట్ కాకపోతే ప్రైవే టు వ్యాపారులే గతి అనే పరిస్థితి నెలకొన్నది.
కాంటాలు కదలవు. మద్దతు ధర లభించదు. ఈలోగా వానలు, వరదలు ముంచెత్తడంతో పత్తిబేళ్లు తడిసి అసలుకే ఎసరు వస్తున్నది. ఇంకోవైపు ఎకరాకు సగటున 13 క్వింటాళ్లు కొంటామన్న సీసీఐ చివరి నిమిషంలో చెప్పాపెట్టకుండా ఎకరాకు 7 క్వింటాళ్లకు తగ్గించడంతో రైతుల నెత్తిన పిడుగుపడింది. గతిలేక ప్రైవేటుకు, అదీ అడ్డికి పావుశేరుకు అమ్ముకోక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టారు. తేమ శాతం ఎక్కువగా ఉందనో, రంగు మారిందనో ఇష్టారాజ్యంగా ధర చెల్లిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 22 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఇప్పుడు 12 శాతం ఉంటేనే నాసిరకం అంటూ ధర తగ్గిస్తున్నారు. పంట దిగుబడి సమయంలో, మార్కెట్కు తరలించే సమయంలో వర్షాలు, తుఫానులు రావడం తెలిసిందే. తద్వారా తేమశాతం కొంచెం పెరగడమూ సహజమే. ఈ నేపథ్యంలో రైతు పట్ల కనీస సానుభూతితో వ్యవహరించాల్సిందిపోయి కొర్రీలతో చుక్కలు చూపించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఇతర రాష్ర్టాల్లోనూ యాప్ కారణంగా పత్తి రైతులు యాతనలు పడ్డారు. పంజాబ్ రైతులైతే ఈ యాప్ తమకొద్దని తిరస్కరించారు.
దేశంలో పత్తి మార్కెట్ తీవ్రమైన కుదుపులు ఎదుర్కోవడం మరో సమస్య. అమెరికా టారిఫ్ యుద్ధం నేపథ్యంలో భారత రైతుల ప్రయోజనాలను ఎట్టిపరిస్థితుల్లో కాపాడి తీరుతానని బీరాలు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ పత్తిపై దిగుమతి సుంకాన్ని 11 శాతం నుంచి సున్నా కు తగ్గించడం రైతుకు చివరి శరాఘాతమైంది. ఈ యూటర్న్ ఫలితంగా అమెరికా, బ్రెజిల్ నుంచి విదేశీ పత్తి వరదలా వచ్చిపడుతుంటే స్వదేశీ పత్తి ధర లేక వెలవెలబోతున్నది. తెల్లారి లేస్తే అధిష్ఠానం ముందు మోకరిల్లేందుకు ఢిల్లీకి చక్కర్లు కొట్టే సీఎం రేవంత్రెడ్డి పత్తి రైతుల సమస్యలపై బడేభాయ్ని ఒప్పించే ప్రయత్నమేదీ చేయడం లేదు. ఇటు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతూ, అటు ఢిల్లీకి మూటలు మోయడంలో బిజీగా గడుపుతున్న రాష్ట్ర సర్కారు పత్తి కొనుగోళ్ల సమస్యపై పూర్తి అలసత్వం చూపుతున్నది. సీసీఐ రెండుసార్లు టెండర్లు పెడితే మిల్లుల యాజమాన్యాలు ఎగ్గొట్టాయి. దాంతో విధిలేక మూడోసారి పిలవాల్సి వచ్చింది.
ఈలోగా పుణ్యకాలం గడిచిపోతూనే ఉన్నది. జిన్నింగ్ మిల్లులకు, సీసీఐకి మధ్య అనుసంధానంతో వ్యవహరించి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకోవడంతో దేశమంతటా ఒప్పందాలు కుదిరినా ఇక్కడ మాత్రం ఆలస్యమైంది. వీటన్నిటి ఫలితంగా సిరులు తెస్తుందనుకున్న తెల్ల బంగారం ఉరులు పేనుతున్నది. ఆశలు కోల్పోయిన పత్తి రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. అన్నిరకాలుగా ఆశలు అడుగంటడంతో పత్తి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ నేతలు రైతుల వెన్నంటే ఉంటూ, ధైర్యం చెప్పడమే కాకుండా వారి ఆందోళనలకు మద్దతిచ్చి వారితోపాటుగా ధర్నాల్లో పాల్గొని లాఠీ దెబ్బలు తింటున్నారు. సర్కార్ను అడుగడుగునా నిలదీస్తూ, కొనుగోళ్లు జరిపేలా కొరడా ఝళిపిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపే ప్రేమలో లేశమైనా రైతుల మీద చూపితే ఈ పరిస్థితి వచ్చేది కాదు.