Vemula Prashanth Reddy | పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో ఈ-నామ్ విధానం ద్వారా కాకుండా బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు జరగడం వల్ల రైతులు మద్దతు ధర పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో రైతులు నిజామాబాద్ గంజ్‌లో ధర్నా నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పసుపు రైతులు పంట అమ్ముకోవడంలో పడుతున్న ఇబ్బందులను తొలగించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. మార్కెట్ యార్డ్‌కు భారీగా పసుపు పంట వచ్చినప్పటికీ, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని అన్నారు.దీంతో రైతులు తమ పంట అమ్ముకోవడానికి మూడు నాలుగు రోజుల పాటు మార్కెట్ యార్డ్‌లో వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు.
ఇక్కడ బీజేపీ ఎంపీగా అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ ఉండి కూడా లాభం లేకుండా పోయింది. పసుపు రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇటీవల ఎంపీ అరవింద్ ‘ఈ-నామ్ 1.50’కింద కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికి కార్యరూపం దాల్చలేదని , సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి కొనుగోళ్లు నిలిపివేసి బహిరంగ వేలం నిర్వహించడం అన్యాయమని ఆయన అన్నారు.మొదట ‘ఈ-నామ్ 2.50’ గురించి మాట్లాడి, తర్వాత ‘ఈ-నామ్ 1.50’ అని చెప్పడం రైతుల్లో గందరగోళం సృష్టించిందని విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి దారుణంగా మారిందని, చాపల మార్కెట్ల మాదిరిగా బహిరంగ వేలం ద్వారా దళారులు కుమ్మక్కై తక్కువ ధరలకు పసుపు కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు.
దళారులకు లాభం..
పారదర్శకత లేకుండా బహిరంగ వేలం నిర్వహించడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని, దళారులకు లాభం చేకూరుతోందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తప్పుపట్టారు. మార్కెట్ యార్డ్‌కు పసుపు తీసుకువచ్చిన రైతులు రోజుల తరబడి సరైన ధర కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరమని అన్నారు. దళారులు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేసే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని.. బహిరంగ వేలం నిలిపివేయాలని.. ఈ-నామ్ విధానంలోనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానంలో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించి పసుపు కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తున్న పసుపు రైతులకు BRS పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతామని, సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
Mahabubabad | చెత్తను ఊడ్చి మున్సిపల్ కార్యాలయంలో పడేసిన ప్రజలు : వీడియో
రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తండ్రి
Ashok Mittal | ఫెమా ఉల్లంఘన ఆరోపణలు.. ఆప్ ఎంపీ ఇల్లు, వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు