Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. పొలానికి నీరు పారించేందుకు మోటర్ స్టార్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన పెట్టిగాడి రామచంద్రం (61) మంగళవారం ఉదయం గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. పొలం దగ్గర బోర్ మోటర్ స్టార్ట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో అక్కడికక్కడే రామచంద్రం మరణించాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రామచంద్రం ఎంతసేపైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. బోర్ మోటర్ వద్ద విగతజీవిగా కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.