Telangana Formation Day | కంటేశ్వర్, మే 26 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. జూన్ 2న నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, వ్యవసాయం, వైద్యారోగ్యం తదితర శకటాలను ప్రదర్శించాలని సూచించారు.
అదేవిధంగా వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఫిషరీస్, ఇరిగేషన్ తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీలు రాజావెంకట్ రెడ్డి, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.