Sleep Divorce | ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా స్లీప్ డైవోర్స్ అనే కొత్త రిలేషన్షిప్ ట్రెండ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ట్రెండ్ లో భారతదేశం ముందంజలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. స్లీప్ డైవోర్స్ అంటే దంపతులు ప్రతిరోజూ ఒకే బెడ్ లో నిద్రపోవడం కాకుండా మంచి నిద్ర కోసం వేరువేరు పడకల్లో లేదా వేరే గదుల్లో నిద్రపోవడం. తాజా సర్వేల ప్రకారం భారతదేశంలోని దంపతుల్లో సగానికి పైగా వేరు వేరుగా నిద్రపోతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. గురక, వేర్వేరు నిద్ర సమయాలు, ఉద్యోగ ఒత్తిడి, జీవనశైలిలో తేడాల కారణంగా ఇలా వేరుగా నిద్రపోతున్నారని తెలుస్తోంది. స్లీప్ డైవోర్స్ అనే పదం భయపెట్టేలా అనిపించినా దాని అర్థం బంధం చెడిపోతుందని కాదని నిపుణులు చెబుతున్నారు.
మంచి నిద్ర కోసం ఉద్దేశపూర్వకంగా వేరే వేరే పడకల్లో లేదా గదుల్లో నిద్రపోతారని ఇది శాశ్వతం కాదని కొందరు వర్క్ డేస్ లో వేరుగా నిద్రపోయినా వీకెండ్స్ కలిసి నిద్రపోతారని, నిద్ర ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ విధానం కూడా ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దంపతులు వేరుగా నిద్రపోవడానికి గల ప్రధాన కారణాలను కూడా నిద్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గురక, స్లీప్ అప్నియా కారణంగా ఒకరి నిద్ర మరొకరికి భంగం కలిగిస్తుంది. దీని వల్ల దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యలు వస్తాయి. అలాగే షిప్ట్ ఉద్యోగాలు, స్క్రీన్ వినియోగం, తెల్లవారు జామున త్వరగా లేవాల్సి రావడం వంటివి భాగప్వామి నిద్రను ప్రభావితం చేస్తాయి. అలాగే దంపతుల మధ్య తరచూ గది ఉష్ణోగ్రత, లైటింగ్ వంటి విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. ఇవి కూడా నిద్రపై ప్రభావం చూపుతాయి. అదే విధంగా దీర్ఘకాలిక పని గంటలు, పిల్లల సంరక్షణ వంటి అంశాలు కూడా నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తాయి. ఈ కారణాల వల్ల వేరుగా నిద్రపోవడం వల్ల తమ నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని చాలా మంది చెబుతున్నారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం వేరుగా నిద్రపోయిన జంటల్లో సగానికి పైగా వారు ఎక్కువ సమయం, మంచి నిద్రను సొంతం చేసుకున్నారని తేలింది. నిద్రలేమి కారణంగా మానసిక ఆరోగ్యంతోపాటు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నిద్రలేమి కారణంగా హృదయ సంబంధిత వ్యాధులు, ఊబకాయం, మధుమేహం, ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీని వల్ల దంపతులు ఎక్కువగా గొడవ పడే అవకాశం ఉంటుంది. స్లీప్ డైవోర్స్ మంచిదే అయినప్పటికీ ఇది అందరికీ సరిపోదని కూడా నిపుణులు చెబుతున్నారు. వేరుగా నిద్రపోవడం వల్ల కొందరిలో ఒంటరితనం పెరుగుతుంది. భావోద్వేగ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కౌగిలించుకోవడం, పడుకునే ముందు మాట్లాడుకోవడం వంటి విషయాలు కూడా జంటల మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. స్లీప్ డైవోర్స్ పెరుగుతున్న ఆధునిక ట్రెండే అయినప్పటికీ అంతిమంగా ఆరోగ్యకరమైన నిద్రతో పాటు ఆరోగ్యకరమైన సంబంధాన్ని కూడా నిలబెట్టుకోవడం మంచిదని నిద్ర నిపుణులు తెలియజేస్తున్నారు.