Suicide | పెళ్లి చేసుకుందామంటే ప్రియురాలు ఒప్పుకోలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామని యువతి ఎంత చెప్పినా వినిపించుకోలేదు.. నేను అడిగినప్పుడే వస్తావా లేదా అని గొడవ పెట్టుకున్నారు. ప్రియురాలి దగ్గర తన మాట నెగ్గలేదని క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కురవి ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. కురవికి చెందిన వల్లభనేని శశికుమార్ (21) ఇంటర్‌తో చదువు ఆపేశాడు. ప్రస్తుతం పెయింటింగ్ పనిచేస్తున్నాడు. కేసముద్రం మండలానికి చెందిన యువతితో ఏడాది క్రితం శశికుమార్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆమెనే పెళ్లి చేసుకోవాలని శశికుమార్ నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవల ప్రియురాలికి ఫోన్ చేసిన శశికుమార్.. బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అందుకు సదరు యువతి నిరాకరించింది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు అవుతున్నాయని.. అవి పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామని సర్దిచెప్పింది. కానీ అందుకు శశికుమార్ వినించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.
ప్రియురాలి దగ్గర తన మాట నెగ్గలేదని శశికుమార్ తీవ్రంగా మనస్తాపం చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.