Contact Faculty | భిక్కనూరు : యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే శాశ్వత నియామకాలు చేపట్టాలని.. కాంట్రాక్ట్ అధ్యాపకుల జీవితాలను రోడ్డుపాలు చేయొద్దని కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ విశ్వ విద్యాలయం దక్షిణ ప్రాంగణంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల కో ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులను బహిష్కరించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యుల (అసిస్టెంట్ ప్రొఫెసర్లు) కోసం జీవో నెంబర్ 21 తీసుకువచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకుల పొట్ట కొట్టడం సరికాదన్నారు.
15 నుండి 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఉన్నత అధికారుల ప్రలోభాలకు తలోగ్గి.. సరైన ప్రమాణాలను పాటించకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని.. లేనిపక్షంలో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.
అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల చిన్న చూపు చూడడం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి బేసిక్ ప్లస్, డీఏ ప్లస్ హెచ్ఆర్ఏతోపాటు 3% ఇంక్రిమెంట్, ఉద్యోగ భద్రత కల్పించాలని.. లేనిపక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు.
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కాంట్రాక్ట్ అధ్యాపకుల పాత్ర వెలకట్టలేనిది, తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్