నందిగామ, ఏప్రిల్08 : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి తీవ్ర గాయలై మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నందిగామ భైపాస్ రోడ్డుపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల పట్టణానికి చెందిన తుపాకుల ఆంజనేయులు(48) షాద్ నగర్లో ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు సేకరించి అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. కాగా, సోమవారం రాత్రి నందిగామ భైపాస్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయలై కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
గమనించిన స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌కి సమాచారమిచ్చారు. సుమారు రెండు గంటలైనా అంబులెన్స్ రాకపోవడంతో చేసేది ఏమి లేక పోలీసులు ఓ ప్రైవేట్ డీసీఎంలో షాద్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో వల్లనే ఆంజనేయులు మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. ఆపద సమయంలో రావాల్సిన అంబులెన్స్‌లు ఈ మధ్య కాలంలో సరిగా రావడం లేదని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.