Kunal Kamra : స్టాండప్ కమెడియన్ (Stand up commedian) కునాల్ కమ్రా (Kunal Kamra) కు బాంబే హైకోర్టు (Bombay High Court) లో ఊరట లభించింది. మహారాష్ట్ర (Maharastra) డిప్యూటీ సీఎం (Deputy CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ను ఉద్దేశించి ద్రోహి (Traitor) అని వ్యాఖ్యానించినట్లు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) ను రద్దు చేయాలని కోరుతూ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.
ఆ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం ఈ నెల 16న విచారణకు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అప్పటివరకు కునాల్ కమ్రాను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అదేవిధంగా కమ్రా ఏక్నాథ్ షిండేను ఉద్దేశించే ద్రోహి అనే వ్యాఖ్య చేశాడనడానికి రుజువులు ఏమైనా ఉంటే కోర్టుకు సమర్పించాలని ఎమ్మెల్యే ముర్జిపటేల్ను, ఖార్ను పోలీసులను కోరింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది.
ఇటీవల ‘నయా భారత్’ అనే స్టాండప్ కామెడీ షోలో కునాల్ కమ్రా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ‘గద్దార్’ (ద్రోహి) గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించారు. దీనిపై వివాదం చెలరేగింది. డిప్యూటీ సీఎంను అవమానించారంటూ శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కునాల్ కమ్రాపై ఖార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని మార్చి 27న కునాల్ కమ్రా అన్నారు. అదేరోజు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు ఏప్రిల్ 7 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత పొడిగించింది. ఈ క్రమంలో ఖార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు కోరుతూ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.