గాంధారి : ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా గాంధారి మండలంలో చోటుచేసుకుంది. గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలో నివాసం ఉండే షేక్ అహ్మద్ (32) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి, సొంత గ్రామమైన మండలంలోని గండివేట్ గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వచ్చి, పని ముగించుకొని అర్ధరాత్రి 12 గంటల తర్వాత తిరిగి బాన్సువాడకు బయలు దేరాడు.
మొండి సడక్ గ్రామ సమీపంలోని దర్గా వద్ద వెనుక నుంచి వచ్చిన కారు (Car) వేగంగా అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో షేక్ అహ్మద్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారని, మృతుడి భార్య షేక్ సమ్రీన్ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.