MLA Vemula Prashanth Reddy | దేశంలోనే సాగులో తెలంగాణలో ఆకాశమంత సంపద సృష్టించిన కేసీఆర్‌కు కాంగ్రెస్ బురద అంటించే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నేడు నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ పడ్డ తాపత్రయం, తండ్లాట అర్ధం కానివారే తప్పుడు కూతలు కూస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవాలను గమనించి దశాబ్ధాల తరబడి ప్రాజెక్టులు పూర్తి కాకుండా పోవడం చూసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని శీఘ్ర గతిన పనులయ్యే రంగంగా మార్చారు.
ఎంత త్వరగా అయితే అంత తొందరగా తెలంగాణ బీడు భూములకు నీళ్లు పారించాలే అనే తాపత్రయంతో కేవలం మూడు సంవత్సరాల కాలంలో కాళేశ్వరం కట్టారు తప్ప ఇంకోటి కాదు. అందులో ఏ తప్పు జరుగలేదు. చీమంత సమస్య కూడా జరగని కాళేశ్వరం ప్రాజెక్టులో కొండంత సమస్యగా జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నరన్నారు. ఒకప్పుడు తెలంగాణ వ్యవసాయం అంటే ఎత్తిపోయిన బోరు బావులు, చాలీ చాలని కరెంట్‌తో రైతులు గోస పడేవారు. దిక్కుతోచని స్థితిలో మొగులుకి మొఖం పెట్టి మా బీడు భూములు తడపడానికి ఒక చినుకు పడకపోతుందని రైతులు ఎదురు చూసేవారు. వ్యవసాయం దండగలా ఉండే..
ఇప్పుడు గడిచిన గత 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టి, చెరువులు నింపి, వాగులు వంకల్లో చెక్ డ్యామ్‌లు కట్టి నీటిని ఆపి ఎత్తిపోయిన బోర్లలో నీటి ధార వచ్చేట్టు చేసింది కేసీఆర్. కడుపు నిండా కరెంటుతో ,రైతు భీమాతో ,ఊరూరా కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయం పండగల మారింది. కాళేశ్వరంతో ఆంధ్రా ప్రాంతంలోనే కాదు మాకు కూడా చివరి ఆయకట్టుకు కాలువల ద్వారా సాగు నీరు వస్తది. మేము కూడా దర్జాగా రెండు లేదా వీలైతే మూడు పంటలు కూడా పండించుకోవచ్చు అని తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా కలిగింది అంటే
కారణం ఒకే ఒక్కడు.. అది కేసీఆర్ తన సంకల్ప దీక్షతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ సాగు బతుకు మార్చిన అపర భగీరథుడు మన పెద్ద రైతు కేసీఆర్ అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ మళ్లీ దుష్ప్రచారం..
సాహసిలా ఈ ప్రాంతానికి నీటికష్టాలు తీర్చాలని ప్రాజెక్టు కట్టిన కేసీఆర్‌పై కాకమ్మ కథలు అల్లుతున్నరన్నారు. మేడిగడ్డను పండబెట్టి గోదావరి నీళ్లను ఆపకుండా నేరుగా క్రిందకు పోనిచ్చి (ఆంధ్రాకు) బనక చర్లకు గోదావరి నీళ్లను దోచిపెట్టి చంద్రబాబుకు గురుదక్షిణగా ఇవ్వడం కోసమే కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల అప్పుడు కాళేశ్వరం కొట్టుకుపోయింది అని దుష్ప్రచారం చేసి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బరాజ్ ఒక్కటే కాదు. కాళేశ్వరం అంటే అందులో 3 బ్యారేజీలు,15 రిజర్వాయర్లు,19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు,
203 కిలోమీటర్ల సొరంగాలు,1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్,98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ,530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్,240 టిఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారం కాళేశ్వరం… ఇన్ని ఉంటే అందులో ఒకే ఒక బ్యారేజీలో ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే దానిని బాగు చేసి రైతాంగానికి నీరు ఇవ్వాల్సింది పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం , రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అని అవినీతి అని నానా రాద్దాంతం చేస్తున్నదని విమర్శించారు.
21 నెలల పాలనలో మూడు నెలలపైన బయటే..
రేవంత్ ఢిల్లీ 51 సార్లు పోయారు. విదేశాలకు మూడు నాలుగు సార్లు వెళ్లారు. 21 నెలల పాలనలో మూడు నెలలపైన బయటే గడిపారు. సీఎంకు ట్రిప్పుల మీద ఉన్న మోజు రైతుల తిప్పలు తీర్చడంలో లేదు.. హామీలు ఏమయ్యాయని అడిగితే కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతున్నారు. కమిషన్ల పేరిట.. ఎంక్వైరీల పేరిట.. అరెస్టుల పేరిట అడిగే వారిని బయపెట్టాలని చూస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారు. కుంటిసాకులతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప.. రైతుల కడుపు నింపే పనులు చేయడం లేదు.. రుణ మాఫీ నుంచి రైతు భరోసా దాకా రేవంత్‌ది అంతా మోసమే.. చారాణా పని కూడా చేయలేదు బారాణా ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తోంది. మాఫీలు అమలు కాలేదు కానీ హామీల మాఫీ అమలవుతోందని ఎద్దేవా చేశారు.
Karnataka | ఓటర్ లిస్ట్‌లో అక్రమాలు.. సొంత పార్టీ నేతలపై కర్ణాటక మంత్రి ఫైర్
Srinuvaitla | బాలకృష్ణతో సినిమాపై స్పందించిన శ్రీనువైట్ల.!
Film Federation | ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల నిరసన