Karnataka | బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు గెలుస్తుందని ఇంటర్నల్ పోల్స్ అంచనా వేశాయి.. అయితే కాంగ్రెస్‌కు 9 సీట్లు మాత్రమే వచ్చాయని, దీనికి కారణం ఓట్లను చోరీ చేయడమేనని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న స్పందిస్తూ.. రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు. అదే విధంగా కర్ణాటకలోని సొంత పార్టీ నేతలపై కేఎన్ రాజన్న తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను తయారు చేశారని రాజన్న పేర్కొన్నారు. మరి ఆ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగితే.. ఆ సమయంలో ఎవరూ ఎందుకు మాట్లాడలేదు..? ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలను బహిరంగంగా ప్రశ్నించారు. ఓటర్ లిస్ట్‌లో అవకతవకలు జరగడంతోనే మోదీ మరోసారి ప్రధాని పదవి చేపట్టారన్నారు. ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల ఓటరు జాబితాను మార్చిందనేది 100 శాతం నిజం అని స్పష్టం చేశారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో మోసం జరిగిందన్నారు. ముసాయిదా జాబితా తయారు చేసినప్పుడు, దాన్ని పర్యవేక్షించడం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కదా..? అని ప్రశ్నించారు. ఈ అక్రమాలన్నీ మన కళ్ల ముందే జరిగాయి. అప్పుడు మౌనం వహించడం సిగ్గుచేటు. ఇలాంటి మోసాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పటిష్టంగా పని చేయాలన్నారు. రాజన్న వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత చర్చకు దారి తీశాయి.
కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో లక్షకు పైగా నకిలీ ఓటర్లు, నకిలీ చిరునామాలు, బల్క్ ఓటర్లు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ దర్యాప్తులో తేలింది. బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ స్థానంలో 6.5 లక్షల ఓట్లలో లక్షకు పైగా ఓట్ల ‘దొంగతనం’ జరిగింది. కర్ణాటకలోని అనేక బూత్‌లలో వేర్వేరు రాష్ట్రాలలో ఓటు వేసిన సుమారు 11 వేల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించాం.
ఈ ఓటర్ల పేర్లు, బూత్ నంబర్లు, చిరునామాల జాబితా మా వద్ద ఉంది అని ఇటీవల రాహుల్ గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే.