పౌష్టికాహారానికి ఆధార్

- చిన్నారుల వివరాలు ఆన్లైన్లో నమోదుకు శ్రీకారం
- ఐసీడీఎస్ సూపర్వైజర్లకు పూర్తయిన ప్రత్యేక శిక్షణ
- అక్రమాలకు చెక్పెట్టేందుకుప్రభుత్వ నిర్ణయం
- పౌష్టికాహారం పంపిణీలో పెరగనున్న పారదర్శకత
కోటగిరి : అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మరింత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించే చిన్నారులకు ఇక ఆధార్ తప్పనిసరి చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. పౌష్టికాహారం తీసుకుంటున్న చిన్నారుల వివరాలు ఆన్లైన్ చేసేందుకు కసరత్తు మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల వారీగా సూపర్వైజర్లకు ఆధార్ నమోదుపై ఇప్పటికే శిక్షణ పూర్తయ్యింది. వారికి ట్యాబ్‌లు అందించి వాటి ద్వారా చిన్నారుల ఆధార్‌తోపాటు వివరాలు నమోదు చేయనున్నారు. ఐదేండ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నారు. కేంద్రాల నిర్వహణలో పారదర్శకత కోసం చిన్నారులకు సంబంధించి ఆధార్ నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. వారికి అందించే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా.. అంతా పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కేంద్రాల్లో అధికంగా ఐదేండ్లలోపు చిన్నారులు మాత్రమే ఉంటారు. దీంతో వారికి ఆధార్ కార్డులు లేవు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రాలకు వెళ్లే ప్రతి చిన్నారికీ ఆధార్ కార్డులు అందనున్నాయి.
లెక్కలు తెలియక పక్కదారి..
అంగన్వాడీ కేంద్రాల్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న చిన్నారులు.. పాఠశాలలో చేరినా కూడా అంగన్వాడీల నుంచి వీరి వివరాలను తొలగించడం లేదు. దీనికి తోడు చిన్నారులు కేంద్రానికి వచ్చినా.. రాకపోయినా.. అందరికీ పౌష్టికాహారం ఇచ్చినట్లుగా చూపుతూ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కొంత మంది గర్భిణుల వివరాలు అటు అత్తగారి గ్రామంలోనూ.. ఇటు పుట్టింటి వద్దా నమోదు చేయిస్తున్నారు. దీంతో ఒకరి పేరే రెండు గ్రామాల్లోనూ ఉంటుంది. ఫలితంగా గర్భిణులు, బాలింతల లెక్కల్లో తప్పులు దొర్లుతున్నాయి. పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. అంగన్వాడీ పరిధిలో ఉండే చాలా మంది చిన్నారులకు ఆధార్ కార్డులు లేవు. దీంతో వీరి సంఖ్య పక్కాగా తెలియడం లేదు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. ఆ కేంద్రాల ద్వారా చిన్నారులకు సంబంధించిన ఆధార్ కార్డులను నమోదు చేయించుకోవచ్చు. చిన్నారుల ఫొటో, వివరాలు, తల్లుల వేలిముద్రలు తీసుకొ ని ఆన్లైన్లో నమోదు చేస్తారు. పర్యవేక్షకులు ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకొని నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు.
ఐసీడీఎస్ సూపర్వైజర్లకు శిక్షణ..
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆధార్ కార్డులు నమోదు చేయించుకునేందుకు జిల్లాలోని ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ ఐసీడీఎస్‌లో పని చేస్తున్న సూపర్వైజర్లకు ఇటీవల శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా ట్యాబ్‌లు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న సూపర్వైజర్లు తమ ప్రాజెక్టుల పరిధిలోని సెంటర్లకు వెళ్లి నిత్యం 45 మంది చొప్పున చిన్నారుల ఆధార్ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల ఫొటోలు తీయడంతో పాటు తల్లిదండ్రుల వేలిముద్రలను ఆధార్‌లో పొందుపరుస్తారు. ఈ ప్రక్రియను మార్చి-2021 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది..
తొలగనున్న ఇబ్బందులు..
అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా చిన్నారులు, తల్లిదండ్రుల ఇబ్బందులు తీరనున్నాయి. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో పర్యవేక్షకులే ఈ ప్రక్రియను నిర్వహించడానికి వీలుంది. భవిష్యత్‌లో అంగన్వాడీ టీచర్లతోనే శిబిరాలు ఏర్పాటు చేసే అంశా న్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చిన్నారుల ఫొటో, వివరాలను నమోదు చేసుకుంటారు. పిల్లల వేలిముద్రలు, బయోమెట్రిక్ నమోదులో సమస్యలను గుర్తించి తల్లుల వేలిముద్రలను తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.
గడువులోగా పూర్తి చేస్తాం..
అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులందరికీ ఆధార్ నమోదు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వీటి ద్వారా చిన్నారులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు దోహదపడుతుంది. బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టుల పరిధిలోని సూపర్వైజర్లకు ఇదివరకే శిక్షణ ఇచ్చాం. వీరు ఆధార్ నమోదు లేని పిల్లలకు నమోదు చేస్తారు. టీచర్లు ఇచ్చే తేదీల ఆధారంగా నమోదు చేపడుతారు. ఉన్నతాధికారులు ఇచ్చిన గడువులోగా ఈ ప్రక్రియ ను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
-ఝాన్సీరాణి,
జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి, నిజామాబాద్.