Actor Vishal | తమిళనాట సినిమా ఇండస్ట్రీతో రాజకీయాలు పెనవేసుకుపోయాయి. ఈ క్రమంలో సినిమాల విడుదల విషయంలో పంచాయితీ కొనసాగుతూ వస్తున్నది. నటుడు విశాల్, మంత్రి ఉదయనిధి స్టాల్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతున్నది. గతంలో ఉదయనిధిపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా విశాల్ నటించిన ‘రత్నం’ మూవీని విడుదల చేసేందుకు సిద్ధం కాగా.. థియేటర్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు వెనుకడుగు వేస్తున్నాయి. తాజాగా మరోసారి మంత్రిపై విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన సినిమాల విడుదలను కావాలనే కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిన్నారని ఆరోపించారు. పరిశ్రమలో తనను అణచివేయాలని చూస్తున్నారన్నారు. నష్టాలకు సంబంధించి ఫిర్యాదు చేసిన వ్యక్తులతో తమకు సంబంధం లేదని.. పలు జిల్లాల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు థియేటర్లు ఇవ్వడం లేదన్నారు. సినిమాలకు నష్టం కలిగించాలని చేసే ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. చట్టపరంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. గతంలో ఇంటర్వ్యూలోనూ విశాల్.. ఉదయనిధికి సంబంధించిన ‘రెడ్ జెయింట్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థపై మండిపడ్డారు. వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని సినిమాలు తీసి రిలీజ్ చేయడానికి చేస్తుంటే పలానా సమయంలోనే రిలీజ్ చేయాలి.. ఇన్ని రోజులే థియేటర్స్ ఆడించాలని ఎవరో ఓ వ్యక్తి ఏసీ రూంలో కూర్చొని కంట్రోల్ చేస్తున్నాడని మండిపడ్డాడు.
కంట్రోల్ చేసేందుకు ఆ వ్యక్తి ఎవరు ? ఎవరు అధికారం ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విశాల్ మాత్రమే కాకుండా చాలా మంది హీరోలు సైతం ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా.. విశాల్ నటించిన ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీని తెలుగులో సైతం విడుదల చేయనున్నారు. మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్ సతీశ్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా విడుదల చేస్తుండగా.. సినిమాను ఈ నెల 26న విడుదలవనున్నది.