Laya | తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు కుటుంబ కథానాయికగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటి లయ తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా 1990 నుంచి 2000 మధ్యకాలంలో ఆమె వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందింది. కూచిపూడి నర్తకిగా, జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందిన లయ, సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటిస్తూ కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. బాలనటిగా ‘భద్రం కొడుకో’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన లయ, తరువాత కథానాయికగా ‘స్వయంవరం’ చిత్రంతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘మనసున్న మారాజు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘శివరామరాజు’, ‘అదిరిందయ్యా చంద్రం’ వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. ఈ చిత్రాలతో ఆమెకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.
అయితే పెళ్లి తర్వాత లయ సినిమాలకు దూరమై అమెరికాలో స్థిరపడింది. అక్కడ కుటుంబ బాధ్యతలతో పాటు ఇతర కార్యక్రమాల్లో బిజీగా గడిపిన ఆమె కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ నటనలోకి అడుగుపెట్టింది. ఇటీవల ‘తమ్ముడు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన లయ తాజాగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే ఫ్యామిలీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నటుడు శివాజీతో కలిసి ఆమె కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన పొందుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన కూతురు శ్లోకాకు కూడా నటనపై ఆసక్తి ఉందని లయ తెలిపారు. గతంలో ఒక సినిమాలో చిన్నపాటి పాత్రలో నటించిన శ్లోకా భవిష్యత్తులో సినిమాల్లో రాణించాలని కోరుకుంటోందని చెప్పారు. సరైన అవకాశం వస్తే ఆమెను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాలో ఉన్న ఒక పాట గురించి మాట్లాడుతూ లయ ఒక సరదా సంఘటనను గుర్తుచేశారు. అందులో వచ్చే ‘పాయ’ అనే పదం తనకు మొదట తెలియదని, తర్వాత అది ఒక నాన్‌వెజ్ వంటకం అని తెలిసి ఆశ్చర్యపోయానని నవ్వుతూ చెప్పారు. షూటింగ్ సమయంలో ఇలాంటి అనుభవాలు చాలా సరదాగా అనిపించాయని పేర్కొన్నారు. ఒకసారి పూర్తి కథ వినకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి అవకాశం కోల్పోయానని చెప్పారు. ‘అరవింద సమేత’ సినిమాలో జగపతిబాబుకి భార్య పాత్రకు ఆఫర్ వచ్చినప్పటికీ అది చిన్న పాత్ర అనుకుని తిరస్కరించానని తెలిపారు. సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్ర ఎంత ప్రభావవంతమో తెలిసి బాధపడ్డానని చెప్పారు. అమెరికాలో స్థిరపడిన తర్వాత కూడా నటనపై తన ఆసక్తి తగ్గలేదని లయ పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన ‘తమ్ముడు’ సినిమా కోసం బరువు పెరగాలని చెప్పడంతో ప్రత్యేకంగా ప్రయత్నించి బరువు పెరిగానని తెలిపారు.