ఆదివారం 31 మే 2020
Nizamabad - May 24, 2020 , 01:43:40

వాగులకు పూర్వవైభవం తెస్తాం..

వాగులకు పూర్వవైభవం తెస్తాం..

 ప్యాకేజీ -21తో వచ్చే ఏడాదికల్లా కాళేశ్వరం జలాలు

ఎస్సారెస్పీని కాళేశ్వరం నీటితో  నింపి చూపిస్తాం

లాభసాటి వ్యవసాయమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం  : మంత్రి వేముల

బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లోని వాగులకు పూర్వవైభవం 

తెస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన బాల్కొండ నియోజక వర్గం కొత్తపల్లి, పచ్చలనడ్కుడ సమీపంలో పెద్దవాగుపై కొత్తగా చెక్‌డ్యాంలు నిర్మించనున్న ప్రదేశాలను పరిశీలించారు. వచ్చే ఏడాది నాటికి ప్యాకేజీ-21 పనులు పూర్తి చేసి నీటిని అందిస్తామని మంత్రి తెలిపారు.  

-నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: జిల్లాలోని వాగులకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు  రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన బాల్కొండ నియోజకవర్గం కొత్తపల్లి, పచ్చలనడ్కుడ గ్రామాల సమీపంలో పెద్దవాగు, కప్పలవాగుతోపాటు పెద్దవాగులో చెక్‌డ్యాంలు నిర్మించనున్న ప్రదేశాలను పరిశీలించారు. అధికారులు, రైతులు, నాయకులతో కలిసి వాగులో కా లినడకన తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్దవాగు, కప్పలవాగులో 365 రోజుల పాటు నీళ్లు ఉండడాన్ని తాను బాల్యంలో చూశానని గుర్తు చేసుకున్నారు. ఈ రెండు వాగుల్లో  అన్ని కాలాల్లో నీరుండేలా  చేయాలన్నదే తన కల అన్నారు. ప్రతి వర్షపు బొట్టునూ సద్వినియోగం చేసుకునేలా తొలివిడుతగా ఈ వాగుల్లో మూడు చెక్‌డ్యాంలు మంజూరు చేసి నిర్మించామన్నారు. సత్ఫలితాలివ్వడంతో విడుతల వారీ గా మరో ఆరు చెక్‌డ్యాంలు మంజూరు చేశామన్నారు.

వచ్చే ఏడాది కల్లా కాళేశ్వరం జలాలు

బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు వచ్చే ఏడాదికల్లా కాళేశ్వరం జలాలను అందిస్తామన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ను మాసాని చెరువుకు అక్కడి నుంచి నిజాంసాగర్‌ పాత కెనాల్‌కు, అక్కడి నుంచి మెంట్రాజ్‌పల్లి వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్‌కు తరలిస్తారన్నారు. అక్కడి నుంచి పైపులైన్‌ ద్వారా పంట పొలాలకు నీళ్లు అందుతాయన్నారు.  

లాభసాటి వ్యవసాయమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం... 

రైతులకు లాభం కలిగించే పంటలను సాగు చేయించాలనేదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. లాభసాటి వ్యవసాయ విధానాన్ని అమలు చేయడంలో రైతుబంధు లాంటి పథకాలు ఇవ్వరనేది తప్పుడు ప్రచారమన్నారు. రైతులు అడగకుండానే సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న ఈ పథకాలు ఎప్పటికీ ఆగిపోవన్నారు. ఈ పథకాలు ఆగిపోతే రాజకీయ లబ్ధి పొందవచ్చని కొందరు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.   

ఎస్సారెస్పీని కాళేశ్వరం జలాలతో నింపి చూపిస్తాం... 

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును పునరుజ్జీవ పథకం ద్వారా నింపి చూపిస్తామని మంత్రి అన్నారు. ప్రతిపక్షాల ఊహకు కూడా అందని ఎన్నో గొప్ప పనులు త్వరలో జరగనున్నాయన్నారు. పునరుజ్జీవ పథకం ద్వారా నీళ్లు రావని సంబురపడ్డ ప్రతిపక్షాల నాయకులు వరద కా లువ ద్వారా కాళేశ్వరం జలాలు ఎగువకు ప్రవహిస్తుండడం చూసి నోటి మాట రాకుండా ఉండిపోయారన్నారు. ఎస్సారెస్పీని నింపి చూపిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. క్వారంటైన్‌ ఖర్చులు భరించలేని వారికి ప్రభుత్వం భరిస్తుందన్నారు. పేదకార్మికులు అవసరమైతే తనకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు.

నాన్న జ్ఞాపకార్థం సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మిస్తా.. 

తన స్వగ్రామం వేల్పూర్‌లో ప్రభుత్వం సమకూర్చిన భూమిలో రూ. 15లక్షలతో రైతువేదిక నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రైతుల కోసం పరితపించిన తన తండ్రి వేముల సురేందర్‌ రెడ్డి జ్ఞాపకార్థం రైతువేదికను నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, వేల్పూర్‌ సర్పంచ్‌ పిట్ల సత్యం తదితరులున్నారు.

ఆశ కార్యకర్తను అభినందించిన మంత్రి

వేల్పూర్‌: పచ్చల నడ్కుడలో వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న ఆశ కార్యకర్తను మంత్రి పలుకరించి అభినందించారు.


logo