బోధన్/ బోధన్ రూరల్/నవీపేట, సెప్టెంబర్ 28: ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలకు బోధన్ మండలంలోని హంగర్గా గ్రామం వద్ద మంజీరా ఉధృతంగా మారింది. మరోసారి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది.భారీ వర్షాలతోపాటు నిజాంసాగర్ నుంచి మంజీరాకు నీటి విడుదల చేపట్టడం, ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ద్వారా హంగర్గ గ్రామంలోకి వరద వచ్చి చేరడంతో పంట పొలాలు నీటమునిగాయి. గ్రామాన్ని వరద చుట్టు ముట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నెలన్నర రోజుల్లో మూడోసారి వరద ముంపును ఎదుర్కొన్న హంగర్గా గ్రామం ఈసారి పూర్తిగా జలదిగ్బంధమైంది. అనేక ఇండ్లు వరద లో మునిగిపోయే ప్రమాదం ఏర్పడడంతో ఆదివారం ఉదయం నుంచి గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు అధికార యంత్రాంగం తరలించడం ప్రారంభించింది. హంగర్గా గ్రామం నుంచి బయటికి వచ్చిన ప్రజలను రెండు ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధానంగా బోధన్ వరకు వచ్చిన వరద బాధితులు ఆ పరిసర ప్రాంతాల్లోని తమ బంధువుల ఇండ్లకు వెళ్లిపోయారు.
ట్రాక్టర్లు ఉన్న కుటుంబాలు తమ ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లపై సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. గ్రామంలో మొత్తం 305 కుటుంబాలు ఉండగా 250 కుటుంబాల వరకు ఇండ్లను ఖాళీచేశాయి. గ్రామంలో ఎతైన ప్రదేశాల్లో ఉన్న కుటుంబాలు మాత్రం గ్రామంలోనే ఉన్నాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు, వరద పరిస్థితిని బోధన్ తహసీల్దార్ విఠల్ రెవెన్యూ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ఖండ్గామ్, బిక్నెల్లి, గ్రామాల్లో పంటలు ఇప్పటికే నీట మునిగాయి. సాలూరా వద్ద పురాతన వంతెన పై నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.