మోర్తాడ్, సెప్టెంబర్ 28: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరగడంతో ఆదివారం ప్రాజెక్ట్ నుంచి 4.59 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. అవుట్‌ఫ్లోను మరింత పెంచే అవకాశం ఉన్నదని, ప్రాజెక్ట్ దిగువన గోదావరి ఆయకట్టు ప్రాంత రైతులు, ప్ర జలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆదివారం ప్రాజెక్ట్‌లోకి ఎగువప్రాంతం నుంచి 3లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ 39 వరదగేట్ల ద్వారా 4.50లక్షల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. వరదకాలువకు 500, కాకతీయ కాలువకు 4వేలు, సరస్వతీకాలువకు 400, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తుండగా, 632క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1084.50అడుగుల (58.356టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది.
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 28: పోచారం ప్రాజెక్టు మరో మారు పొంగిపొర్లుతున్నది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 6వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా..అదే స్థాయిలో ప్రాజెక్టు మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తున్నదని నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు మీదుగా 25.265 టీఎంసీల నీరు నిజాం సాగర్‌లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్, సెప్టెంబర్28: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నది. సింగూరు ప్రాజెక్టుతో పాటు ఘన్పూర్, పోచారం తది తర ప్రాజెక్టుల నుంచి ఆదివారం సాయంత్రం వరకు లక్షా 30,097 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిందని, ప్రాజెక్టు 19 వరద గేట్ల ద్వారా లక్షా 40,236 క్యూక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈఈలు అక్షయ్, సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1401.49 అడుగుల (13.06 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నదని పేర్కొన్నారు.
ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద రావడంతో సింగీతం ప్రాజెక్టు 416.50 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో పొంగి ప్రవహిస్తున్నది. జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 458.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.60 మీటర్ల నీటి నిల్వ ఉన్నది. ఎగువప్రాంతం నుంచి 6,285 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా రావడంతో మూడు వరద గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ సుకుమార్‌రెడ్డి తెలిపారు.