మోర్తాడ్, సెప్టెంబర్ 28 : మక్కజొన్న రైతుకు కష్టమొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి రైతులను కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కష్టాలు వెంటాడుతుండగానే మక్కజొన్న పంట చేతికివచ్చింది. భారీవర్షాల కారణంగా రైతులు పెద్దమొత్తంలో పంటను నష్టపోవాల్సిన పరిస్థితులు ఒకవైపు, మరోవైపు వర్షాల కారణంగా చీడపీడలు ఏర్పడి దిగుబడులు తగ్గడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. చేతికి వచ్చిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు అడిగిన ధరకే విక్రయించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం..రైతులకు శాపంగా మారింది. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో ప్రతి ఏడాది 50 వేల ఎకరాలకుపైగా మక్కజొన్న పంటను సాగుచేస్తున్నారు. గతేడాది 52వేలకు పైగా ఎకరాల్లో పండించిన రైతులు ఈసారి కూడా అదేస్థాయిలో మక్కజొన్నను పండించారు. ఇందులో ఆర్మూర్ డివిజన్లో వర్షాలు కురియకముందే బోరుబావులపై ఆధారపడి పంటలు వేస్తారు. దీంతో ఇప్పటికే మక్కజొన్న పంటలు కోతకు వచ్చి విక్రయాలకు సిద్ధం చేశారు. చాలా మంది రైతులు దళారులకు విక్రయిస్తుంటారు. అయితే దళారు లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 కాగా తక్కువకే కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఒకవైపు భారీవర్షాల కారణంగా పంటలు రైతులు నష్టపోగా, తెగుళ్లు, చీడపీడల కారణంగా దిగుబడి తగ్గడం రైతులకు శాపంగా మారింది. దీనికి తోడు దళారులు తక్కువ ధరకే కొనుగోలు చేయడం, మక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. మక్కజొన్న కోతలు షురూ కాగానే దళారులు 14 మాయిశ్చర్ ఉన్న మక్కలను మొదట రూ.2,050 ధర చెల్లించి కొనుగోళ్లు ప్రారంభించారు. మద్దతు ధర కన్నా దా దాపు రూ.350వరకు తగ్గించగా.. కొనుగోళ్లు ప్రారంభమైన తర్వాత క్రమంగా ధరను తగ్గిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ. 1, 890-1,900కు కొనుగోలు చేయడంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దాదా పు రూ.500 తక్కువ ధరకు మక్కలను విక్రయించుకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు విత్తనాల నుంచి మొదలుకుని విద్యుత్, ఎరువులు, యూరియా, మద్దతు ధర, చివరకు సాగునీరు వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండే.. ఏ పంటఅయినా సరే సమయానికి కొనుగోలు చేయడం, ఎరువులు, యూరియా రైతులకు అందుబాటులో ఉంచడం ఇలా అన్నిసక్రమంగా జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకూ పూర్తిస్థాయిలో మార్పు కనిపిస్తున్నది. యూరియా కోసం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. విద్యుత్‌కోసం సబ్స్టేషన్లు ముట్టడించిన సందర్భాలు అనేకం. గతేడాది సోయా కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం, మక్కలను కొనుగోలు చేసేవారే ప్రస్తుతం లేకపోవడం ఇవన్నీ రైతుల మదిని కలచివేస్తున్నాయి. ఇప్పటికైనా మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయా లని రైతులు కోరుతున్నారు.
కోసిన మక్కజొన్న పంటలను ఆరబెడుతున్న రైతులకు వర్షాల రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. మండలంలోని సుంకెట్ లో మక్కలు తడిసి లాకలు కూడా వచ్చాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థి తులు ఏర్పడుతున్నాయి. తడిసి లాకలు వచ్చిన మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
మక్కజొన్న పంట విక్రయించడానికి గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండే. మద్దతు ధర కన్నా పది రూపాయలు ఎక్కువగానే వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మక్కలు కొనేవారే కరువయ్యారు.గతంలో దళారులు ధర తగ్గించే పరిస్థితి ఉంటే ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తామని ప్రకటించేది. దీంతో రైతులకు ధర లభించేది. ఇప్పుడు మద్దత ధర కన్నా తక్కువకే దళారులు కొనుగోలు చేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలి.
-చిన్న రాజేశ్వర్, రైతు, మోర్తాడ్
దళారులు మక్కల ధరను మార్కెట్లో రోజురోజుకూ తగ్గిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలి. సొసైటీల ద్వారా మక్కలకు మద్దతు ధర రూ. 2,400 ఇచ్చేలా చూడాలి. లేని పక్షంలో రైతుందరూ మరో ధర్నా కార్యక్రమానికి సిద్ధం కావాలి. రైతుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల విషయంలో స్పందిస్తుందని భావిస్తున్నాం.
-శ్రీనివాస్‌రెడ్డి, రైతు, దొన్కల్