Potatoes | చాలా మంది ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఆలుగడ్డలు కూడా ఒకటి. ఇవి చాలా తక్కువ ధరలో విరివిగా లభిస్తూ ఉంటాయి. వీటితో అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. ఆలుగడ్డలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఆలుగడ్డల్లో మనిషి శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఆలుగడ్డలు సహాయపడతాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడంతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక చాలా మంది ఆలుగడ్డలను తీసుకోవడం తగ్గిస్తుంటారు.
అయితే ఆలుగడ్డలను సరైన విధానంలో తీసుకోకపోవడం వల్ల ఇవి అనారోగ్యానికి దారి తీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆలుగడ్డలను ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో తీసుకోవడం వల్ల ఇవి టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ సర్వసాధారణమైపోయింది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె జబ్బులకు దారి తీస్తుంది. శరీర అవయవాల పనితీరు తగ్గుతుంది. డీప్ ఫ్రై రూపంలో ఆలుగడ్డలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఆలుగడ్డలను ఉడికించి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, ఉడికించిన ఆలుగడ్డల కారణంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
అయితే డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే అధిక ఫైబర్, ప్రోటీన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. అలాగే నిత్య జీవితంలో కొన్ని చర్యలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. టీ, కాఫీ లను చక్కెర లేకుండా తీసుకోవాలి. ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. బ్రౌన్ రైస్, క్వినోవా, సోర్డోఫ్ బ్రెడ్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. గింజలు, విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇక ఆలుగడ్డలను సరైన విధానంలో తీసుకోకపోవడం వల్ల ఇవి డయాబెటిస్ కారణమవుతున్నాయని వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.