– ప్రారంభించిన కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలెం రాజు
రుద్రంపూర్, జూలై 31 : సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా మరో ప్రజాహిత కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్తగూడెం పట్టణంలోని రామవరం గణేష్ చమన్‌లో సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో నిర్మించిన 400 మీటర్ల వాకింగ్ ట్రాక్‌ను శుక్రవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలెం రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జీఎం ఎం. షాలెం రాజు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నిత్య జీవితంలో వాకింగ్‌ను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇటువంటి సదుపాయాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ వాకింగ్ ట్రాక్ ద్వారా ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానిక ప్రజలు, యువత, మహిళలు, వృద్ధులు సురక్షితంగా నడక నిర్వహించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనలో సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.కె.సి.ఎం ప్రాజెక్టు అధికారి నరసింహరావు, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్ రావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్, ఎస్వో టు జీఎం ఎం. గోవిందరావు, సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, ఏజీఎం (సివిల్) సి.హెచ్. రామకృష్ణ, కె. రాజారాం, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, డీజీఎం (ఈ&ఎం) ఏరియా వర్క్‌షాప్ క్రిస్టోఫర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మజ్జి మురళి, వివిధ విభాగాల అధికారులు, సింగరేణి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.