Arrested | వినాయక్ నగర్, సెప్టెంబర్ 28 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి నగరంలో తిరుగుతూ కాలం వేసిన ఇంటికి కన్నం వేసి, దోచుకున్న డబ్బులతో జల్సాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులు గత ఐదు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో ఠాణా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తాళం వేసిన ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు.
నాగారం పరిధిలోని బ్రాహ్మణ కాలనీకి చెందిన వేలేటి పవన్ శర్మ అనే వ్యక్తి ఈనెల 23న ఇంటికి తాళం వేసి పూజలు చేసేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం ముండడానికి గమనించిన ఐదుగురు సభ్యులు గల ముఠా అతని ఇంటి తాళం ధ్వంసం చేసి లాకర్ లో ఉన్న 33 తులాల బంగారు ఆభరణాలతో పాటు 25 తులాల వెండి వస్తువులు , రూ.30 వేలు నగదు దోచుకుపోయారు. ఈ ఘటన పై బాధితుడు ఐదో ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. దీంతో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి నిజామాబాద్ నార్త్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 51 ఎస్సై గంగాధర్ సిబ్బందితో కలిసి దోపిడీకి పాల్పడిన ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి నగర శివారులోని నాగారం పరిధిలోగల డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ చౌరస్తా వద్ద ఈరోజు దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ఐదుగురు సభ్యులు కల ఈ ముఠాలో ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్, దొడ్డి కొమరయ్య కాలనీకి చెందిన మరాఠీ ఆకాష్ రావు ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకొని వారి వద్ద నుండి 31 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసి ఆటో రిక్షాను సీజ్ చేసినట్లు తెలిపారు.
ఈ ముఠాకు చెందిన షేక్ సాదక్, వినోద్ రమేష్ చావ్లా, ముక్తే సాయినాథ్ అను మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దోపిడీ ముఠా సభ్యులను పట్టుకోవడంలో కృషిచేసిన ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తోపాటు నార్త్ సీఐ శ్రీనివాస్, ఐదో టౌన్ ఎస్సై గంగాధర్, సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.